విజయ రహస్యం
మగధ దేశపు రాజు వీరసేన మహారాజు. అతను తన ప్రజలను కన్నా బిడ్డల్లా చూసుకుంటాడు మరియు అతని రాజ్యం సుభిక్షమై సుఖశాంతులతో నిండి ఉంటుంది. దానికి రహస్యం రాజు పరిపాలనే కాకుండా తన రాజ్యంలో మంచి బాధ్యతాయుతమైన పరిపాలనా గణం ఉండటమే.
పరిపాలనా దక్షత కలిగిన ప్రధాన అధికారి వృద్దులు అవడంతో రాజుకు అతని తదనంతరం రాజ్య సంరక్షణ బాధ్యత ప్రధాన అధికారిని నియమించాల్సి వచ్చింది.. అందుకు గాను రాజు ప్రజలనుండి ఆ పదవికి నమోదు చేసుకోమన్నారు. అందుకు గాను కొన్ని పరీక్షలకు హాజరు కావాలి. వాటిల్లో నెగ్గాలి. చాలా మంది ఆ పదవికి దరఖాస్తులు పెట్టుకున్నారు. వారందరికీ రాజు అనేక రకాల పరీక్షలు పెట్టాడు. సాము, విల్లు , ద్వంద్వ, మల్ల మరియు ఖడ్గ మొదలైన పరీక్షలు.
వాటన్నిటిలో నెగ్గి చివరగా మిగిలిన ఇద్దరు యువకులు సుహాసుడు మరియు మందారకుడు. వీరిద్దరూ సమఉజ్జీలుగా ఉండడంతో రాజుకు ఎవరిని ఎన్నుకోవాలనేది సమస్యగా మారింది. దానికి తన మంత్రి సలహా ప్రకారం, రాజు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. “అతి ముఖ్యంగా కావలసినది ప్రజల క్షేమం కదా మంత్రివర్యా. కాబట్టి వీరిరువురికీ మీరన్న ప్రకారం చివరి పరీక్ష పెడదాము వారిని రేపు సభకు రమ్మని చెప్పండి .”అన్నాడు.
రాజాజ్ఞ ప్రకారం వారిరువురూ రాజు కొలువుకు వచ్చ్చారు. రాజు వారితో ” మీ ఉభయులకూ నేను పదిహేను రోజులు గడువు ఇస్తున్నాను. మన రాజ్యానికి ఉత్తర దిక్కుగా ఉన్న వింధ్యావళి పర్వతాలలో మధ్యలో ఒక అరణ్యం ఉంది. దానిలో ప్రవహించే హిమధార అనే సరోవరంలో నూటొక్క రెక్కలున్న ఎర్రని కమలాలు ఉంటాయి. వాటిలో ఒక కమలాన్ని తీసుకు రావాలి.
దానిని ఎంతో మంది యక్షులు కాపాడుతూ ఉంటారు కాబట్టి చాలా నైపుణ్యంతో దానిని మీకిచ్చ్చిన గడువు లోపల తేవాలి. ఇది చాలా కష్ట సాధ్యమయ్యే పని కనుక ఇచ్చ్చిన గడువు లో ఆ కమలాన్ని సంపాదించి తిరిగి వచ్చ్చిన వారిని పరాక్రమవంతులుగా పరిగణించి వారికి ఈ రాజ్యాధికార సంరక్షణ పదవి ఇస్తాను ” అని చెప్పాడు. ఈ పరీక్షకు ఇద్దరు ఒప్పుకొని వింధ్యావళి పర్వతాల వైపుగా ప్రయాణాలు మొదలు పెట్టారు.
మంత్రికి రాజుకు ఇద్దరికీ తెలుసు వింధ్యావళి ప్రయాణంలో కుబేరపట్నం అనే గ్రామం వస్తుంది. అక్కడ ప్రజలు ఒక చిరుతపులి ఆగడాల మీద కష్టపడుతున్నారని. మందారకుడు అతి వేగంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి కుబేరపట్నం గ్రామం మీదుగా ప్రయాణిస్తుండగా ఆ గ్రామంలో ఉండవలసి వచ్చింది.
ఆ గ్రామ ప్రజలకు మందారకుడు వీరుడని, రాజు పెట్టిన అన్ని పరీక్షలలో గెలిచాడని తమకు తమ గ్రామాన్ని భయపెట్టే, మానవుని హరించే చిరుతపులి గురించి చెప్పారు. అది చాలా తెలివైనదినీ, గ్రామ ప్రజలను హతమారుస్తున్నాడనీ, దానిని పట్టుకోవడం వారికి సాధ్యం కావడంలేదని, మందారకుడు వారిని ఆ పులి బారి నుండి కాపాడవలసిందిగా కోరారు.
మందారకుడు తన రాజాజ్ఞ గురించి తెలియజేసి తాను పులిని కాపాడాలంటే కొన్ని రోజులు ఆ గ్రామంలో ఉండవలసి వస్తుంది దానివల్ల రాజు ఇచ్చ్చిన గడువులోపల కమలాన్ని సాధిచడంలో ఆలస్యమౌతుందని వారి పులి బాధను రాజుగారికి విన్నవించుకోవలసిందిగా చెప్పి రాజుగారు తప్పక పులి సమస్యను తొలగిస్తారని చెప్పి మరల వింధ్యావళికి ప్రయాణమయ్యాడు.
మందారాకుడలాగానే సుహాసుడు కూడా కుబేరపట్నం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. ఆ గ్రామ ప్రజలు మందారకుడికి చెప్పిన విధంగా చిరుతపులి గురించి చెప్పి దాని బారి నుండి గ్రామ ప్రజలను కాపాడమని కోరారు. సుహాసుడు కూడా రాజు పెట్టిన చివరి పరీక్ష గూర్చి చెప్పి పులిని రక్షించడంలో నిమగ్నమైతే తనకు కమలాన్ని సాధించడంలో సమయాతీతమౌతుందని చెప్పాడు.
కానీ వారి దైన్య స్థితికి గమనించి తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించలేక పోయాడు, అతనికి మనసంతా ఆ అమాయక ప్రజల ఆర్తనాదాలు వారి దీన స్థితులే కలచివేయసాగాయి. రాత్రంతా అలోచించి తన ధైర్య సాహసాలతో ప్రజల కష్టాలను తీర్చడానికి సంసిద్దుడయ్యాడు, దాని వల్ల రాజాజ్ఞ కు సమయంలో కమలాన్ని తాను తేలేకపోవచ్చుఁ, కానీ దానివల్ల పెద్ద ఉన్నత స్థితి పొందగలడేమో కానీ తరువాత తన మనసుకు సర్ది చెప్పుకోలేకపోవచ్చు. తన వీరత్వము ధీరత్వము ప్రజలకు ఉపయోగపడకపోతే దానివల్ల ఏమి లాభం..
తానే శూరుడైతే తప్పక భవిష్యత్తులో మంచి ఉద్యోగం రాకుండా ఉండదు.. ఈ విధంగా రాజాజ్ఞను ఉల్లఘించినట్లౌతుందేమో కానీ తాను ఈ నరబలిని తెలిసి మిన్నకుండలేడు.. ఈ విధంగా అలోచించి సుహాసుడు ఆ గ్రామంలో రెండు రోజులు ఆగి తన పరాక్రమాలతో ధైర్య సాహసాలతో చిరుతపులి పట్టుకొని దానిని హతమార్చగలిగాడు. గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు. సుహాసుడు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంచించి హిమధారను చేరి అక్కడ యక్షులను మెప్పించి దేదీప్యమానంగా వెలుగుతున్న ఎర్రని కమలాలో ఒక కమలాన్ని సాధించి యక్షుల దీవెనలనందుడుకొని తిరిగి మగధ దేశానికి పదిహేడు రోజులలో చేరి రాజుకు కమలాన్ని సమర్పించాడు. కానీ అంతకు మునుపే మందారకుడు పద్నాలుగు రోజులలో రాజుకు కమలాన్ని సమర్పించాడు.
మరునాడు రాజు సభలో వారిద్దరిని పిలిచి సభలో సుహాసుడిని తమ ముఖ్య అధికార ప్రముఖునిగా నియమిస్తున్నాని ప్రకటించాడు. సభలో వారంతా మహారాజుగారి నిర్ణయానికి ఆశ్చర్య పోయారు. మంత్రి గారు మహారాజుగారు సరియైన నిర్ణయం చేశారని , మందారకుడు కమలాన్ని రాజు ఇచ్చ్చిన గడువులోపలే రోజులలో తెఛ్చినా ప్రజానాయకుని ఉండవలసిన కనీస బాధ్యతను విస్మరించాడు. కుబేరపట్నంలో జరిగే చిరుత పులి ఆగడాలు తెలిసినా అది మనుష్యులను చంపుతున్నదని తెలిసినా ఆ గ్రామ ప్రజలను దాని బారి నుండి కాపాడకుండా స్వార్థంగా తన గ్రామోద్యోగి పదవి గురించి ఆలోచించాడే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. కాబట్టి సుహాసుడిని ప్రధాన అధికారిగా మందారకుని సుహాసుని వద్ద అతని అనుచరునిగా నియమించారు” అని చెప్పగా సభలోని వారంతా రాజుగారి నిర్ణయంపై హర్షద్వానాలు చేశారు.