చాకలివాడు మరియు గాడిద
ఒక ఊరిలో ఒక బీడైయ్య అనే చాకలి వాడు ఉండేవాడు. వాడికి భార్య ఒక కొడుకు ఉండేవాళ్ళు. వాడు ఇంటి ఇంటికీ వెళ్లి బట్టలను తీసుకువచ్చి ఊరిలో ఉన్న చెరువు వద్దకు బట్టలను తీసుకెళ్లి ఉతికి వాటిని ఎవరి ఇంటికి వాటిని చేర్చి పొట్ట పోసుకునేవాడు. వాడికి బట్టలను చెరువు వద్దకు తీసుకెళ్ల డానికి వీలుగా ఒక గాడిదను కొన్నాడు. బట్టలను గాడిద మీద వేసుకొని ఉతకడానికి తీసుకెళ్లా లనుకున్నాడు.
ఒకరోజు చాలా బట్టలను గాడిద మీద వేసుకొని తాను తన కొడుకు చెరువుకు వెళ్తుండగా దారిన వెళ్లే కొంతమంది మనుషులు ఎదురు పడ్డారు..”ఏమి బీడైయ్యా బాగున్నావా..” అన్నారు. “బాగానే ఉన్నాను ” అన్నాడు బీడైయ్య. వాళ్ళు వెళ్తూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం బీడైయ్య విన్నాడు. “చూసావా బీడైయ్య తన స్వార్థం కోసం పాపం నోరు లేని గాడిదను ఎలా వాడుకుంటున్నాడో కదా.. ఈ పాపం ఊరికే పోతుందా. నోరులేని జీవాలు ఇలా హింసించవచ్చా. అది ఎంత బరువు మోస్తోందో కదా..”. ఇది విన్న బీడైయ్య వారి మాటలను అంగీకరిస్తూ గాడిద మీదనుండి బట్టల మూటను తీసేసి, వాటిని కొడుకు తలపై ఉంచి చెరువు కేసి సాగాడు. వెళ్తుండగా దారిలో మరికొందరు మనుషులు ఎదురు పడ్డారు..”ఏమి బీడైయ్యా బాగున్నావా..” అన్నారు. “బాగానే ఉన్నాను ” అన్నాడు బీడైయ్య.
వాళ్ళు వెళ్తూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం బీడైయ్య విన్నాడు. “చూసావా బీడైయ్య తన స్వార్థం కోసం పాపం చిన్నపిల్ల వాని తలపై ఇంత భారం మోపుతున్నాడో గదా..ఇంత బలంగా ఉన్న తాను ఆ దుక్కలాగా ఉన్న గాడిద ఎలా హాయిగా నడుస్తున్నాయో కదా “. ఇది విన్న బీడైయ్య వారి మాటలకు ఆశ్చర్య పడుతూ కొడుకు తలపై నుండి బట్టల మూటను తీసేసి, వాటిని తన తలపై ఉంచుకొని చెరువు కేసి సాగాడు. వెళ్తుండగా దారిలో మరికొందరు మనుషులు ఎదురు పడ్డారు..”ఏమి బీడైయ్యా బాగున్నావా..” అన్నారు. “బాగానే ఉన్నాను ” అన్నాడు బీడైయ్య. వాళ్ళు వెళ్తూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం బీడైయ్య విన్నాడు.
“చూసావా బీడైయ్య పాపం ఇంత భారం మోసుకొనివెళ్తున్నాడు గదా..ఇంత బలంగా ఉన్న గాడిద, దున్నపోతులా ఉన్న కొడుకు ఎంత దర్జాగా వెళ్తున్నారో కదా “. ఇది విన్న బీడైయ్య వారి మాటలకు ఏమి చేయాలో తెలియక తన తలపై నుండి బట్టల మూటను తీసేసి, గాడిదను తన తలపై ఉంచుకొని బట్టల మూటను కొడుకు తలపై ఉంచి చెరువు కేసి బయలు దేరాడు. వెళ్తుండగా దారిలో మరికొందరు మనుషులు ఎదురు పడ్డారు..”ఏమి బీడైయ్యా బాగున్నావా..” అన్నారు. “బాగానే ఉన్నాను ” అన్నాడు బీడైయ్య.
వాళ్ళు వెళ్తూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం బీడైయ్య విన్నాడు. “ఈ బీడైయ్య కు అస్సలు తెలివి ఉందా ..ఎవరైనా గాడిదను తలపై పెట్టుకుంటారా.. చిన్నవాడైన తన కొడుకుతో అంత భారం మోయిస్తాడా..”. ఇది విన్న బీడైయ్య వారి మాటలకు ఈసారి తన తలపై నుండి గాడిదను తీసేసి, తన కొడుకు తలపై బట్టల మూటను దించి బట్టల మూటను తన తలపై పెట్టుకొని గాడిదపై కొడుకును కూర్చోబెట్టి చెరువు కేసి బయలు దేరాడు. వెళ్తుండగా దారిలో మరికొందరు మనుషులు ఎదురు పడ్డారు..”ఏమి బీడైయ్యా బాగున్నావా..” అన్నారు. “బాగానే ఉన్నాను ” అన్నాడు బీడైయ్య వాళ్ళు వెళ్తూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం బీడైయ్య విన్నాడు. “ఈ బీడైయ్య కు బుద్ధి లేనట్టుంది. ఎవరైనా అంత గట్టిగా ఉన్న గాడిదను ఉంచుకొని బట్టలను తలపై పెట్టుకుంటారా.. గాడిద పై కొడుకును కూర్చోబెడతాడా. వాడు ఏమి నడవలేడా “.
ఇది విన్న బీడైయ్య వారి మాటలకు చాలా కోపం వచ్చి ఈసారి బట్టలమూటను కొడుకును గాడిదపై ఉంచి నడవసాగాడు. దారిలో మరికొందరు మనుషులు ఎదురు పడ్డారు..”ఏమి బీడైయ్యా బాగున్నావా..” అన్నారు. “బాగానే ఉన్నాను ” అన్నాడు బీడైయ్య. వాళ్ళు వెళ్తూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం బీడైయ్య విన్నాడు. ” బీడైయ్య కు కళ్ళు సరిగ్గాలేనట్టున్నాయి. పాపం ఆ గాడిద పై అంత బరువైన బట్టలమూటను, కొడుకును ఆ గాడిదపై కూర్చోబెడతాడా. అది ఇంక బ్రతుకుతుందా. .”
ఇది విన్న బీడైయ్య సరే ఇలాకానీలే అని బట్టలమూటను కొడుకును తానే మోసుకొని గాడిదను ఊరికెనే నడిపించాడు. ఇది చూసిన మరికొందరు “ఏమి బీడైయ్యా బాగున్నావా..” అన్నారు. “బాగానే ఉన్నాను ” అన్నాడు. వాళ్ళు వెళ్తూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం బీడైయ్య విన్నాడు. “పాపం బీడైయ్య ఈ వయస్సులో కొడుకును కూడా మోస్తూ ఇలా కష్టపడుతున్నాడు. ఆ గాడిద మొహం ఊరికే నడుస్తోంది కదా ..ఇంక దానిని ఎందుకు కొన్నట్టు..” . ఇది తెలుసుకొన్న బీడైయ్య అప్పుడు అర్థం చేసుకున్నాడు. తను ఏమి చేసినా ఈ మనుషులు, ఈ లోకం ఎదో ఒకటి అంటారు..కాబట్టి తనకు ఏది ఎలా మంచిగా సౌకర్యంగా అనిపిస్తుందో అలాగే అదే చేస్తాను అనుకున్నాడు.
తరువాత వాడు తనకు తోచిన విధంగా బట్టలమూటను గాడిపై ఉంచి కొడుకును తాను తోచినంత దూరం ఎత్తుకుని చెరువు కేసి సాగాడు. కాబట్టి ఒకరు అంటున్నారు కదా అని వారు చెప్పి విధంగా చేస్తే నష్టం వస్తే వాటిని వేరే వాళ్ళు తీర్చరు. ఎవరి కష్టనష్టాలు వారికే తెలుస్తాయి.