కథ – వంశాంకురం
సుమతి ఆలోచిస్తూ నడుస్తూ ఉంది. తల నిండా ఆలోచనలు. ఎలా ఉంటుందో తన భవిష్యత్తు.. తన బిడ్డ జీవితం అని. సుమతికి పెళ్లయి మూడు సంవత్సరాలు కావొస్తుంది. భర్త రవి భీమా ఇచ్చ్చే ఇన్సూరెన్సు ఆఫీస్ లో పని చేస్తాడు. రవికి నలుగురు అక్కలు. రవి తల్లికి పెళ్లయిన చాలా కాలం తరువాత రవి పుట్టాడు. రవి నలుగురు అక్కలకి ఆడపిల్లలే పుట్టారు. రవి తల్లి తనకు వంశాంకురం అబ్బాయి పుట్టాలని చాలా ఆశగా ఉంది. సుమతి పెళ్లయినప్పడి నుండీ ఇవే మాటలు ఇంట్లో వింటూ వస్తున్నది. తన ఆరోగ్యం సరిగా లేనందున రవి తల్లి అరుణ ఆశించినంత త్వరగా తాను గర్భవతి కాలేకపోయింది.
ఆ విషయంలో అరుణ కోపంగానే ఉంది. ఇప్పుడు తన అదృష్టం కొద్దీ తాను తల్లి అయ్యానన్న విషయం డాక్టర్ చెప్పగానే అరుణ ఇంటి చుట్టున్న ఇరుగుపొరుగు వాళ్లకు వాళ్లందరికీ స్వీట్స్ పంచి పెట్టింది. అందరూ “అబ్బో ఎంత అదృష్టం.. ఇక నీకు మనవడి పుడతాడు అనీ, ఇక మన మనవడిని ఎత్తుకొని ఎంతో సంబరపడుతుందని, మన అరుణ కు భూమి మీద కాళ్లు ఆనవు, ఎంత అదృష్టమో అరుణకు ..” . ఈ మాటలన్నీ ఇంట్లో ఎంతో ఆనందంగా అరుణ చెబుతూ ఉంటే సుమతి కి కంగారు పుట్టుకొచ్చింది. సరే అబ్బాయి పుడితే మంచిదే. కానీ అమ్మాయి పుడితే అత్తగారు అరుణ ఏమంటుందో. అసలే తనకు ముందు నుండీ వంశాంకురం అబ్బాయి పుట్టాలని తాపత్రయ పడుతోంది.
“రవి నువ్వు డాక్టర్ వీలవుతే అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పమని” అంటూ డాక్టర్ దగ్గరకు వెళ్తున్నప్పుడు పురమాయించింది అరుణ. సుమతికి డెలివరీ అన్నా డాక్టర్ చెక్ చేస్తారు అన్నా టెన్షన్లకి చెమటలు పడుతున్నాయి. ఆవిడకు ఈ విధంగా తనకు అబ్బాయే పుడతాడని ఘంటాపథంగా ఆశలు పెట్టుకుంటుంటే సుమతికి చాలా భయమేస్తోంది. అదే విషయం రవి కి చెప్పింది. రవికి కూడా అబ్బాయే పుట్టాలని కోరికగా ఉన్నాడు. కానీ పైకి “ఏమీ పరవాలేదు. అమ్మకు నచ్చ చెపుదాములే” అన్నాడు.
అసలు అమ్మాయిలంటే ఎందుకు చిన్న చూపు. అమ్మాయిలూ అబ్బాయిలు ఈనాడు సమానమే కదా. డాక్టర్ ను అమ్మాయా అబ్బాయా అని అడగడానికి సుమతికైతే మనసు రాలేదు. తనకైతే అద్దరూ సమానమే. ఈనాడు చూస్తుండగా డెలివరీ రోజు వచ్చింది. సుమతికి ఒకటే గాభరా. దేవుడికి దండం పెట్టుకుని ఎవరైనా తను సమానంగా పెంచుతాననుకుంది మనసులోనే. డెలివరీ బాగానే జరిగింది.
సుమతికి అమ్మాయి పుట్టింది. కానీ తను అనుకున్న విధంగా అరుణ సుమతిని ఏమీ అనలేదు సరికదా చాలా సంతోషంగా ఉండడం చూసి సుమతి అబ్బురపడింది. రవి కూడా ఆనందించాడు. “ఎంత చక్కగా ఉందొ చూడమ్మా మన ఇంటి లక్ష్మి. ఇంటికి అమ్మాయి వస్తే లక్ష్మి వఛ్చినట్లే” అంది అరుణ సుమతితో. అత్తగారి మాటలకు ఏమిటి మా అత్తగారు ఇలా మారిపోయింది అని ఆశ్చర్యపడింది సుమతి. సుమతి ఇంతకు ముందు రవితో అన్న మాటలు రవి అరుణతో మాట్లాడడము అరుణ దానికి “నేను వంశాంకురాన్ని ఆశించాను తప్పితే అమ్మాయి పుడితే నాకు బాధ ఏమీ లేదు.
నేను సుమతి కూడా ఆడవాళ్ళమే కదా, వారికే మాతృత్వాన్ని పొందే అదృష్టాన్ని దేవుడు కల్గించాడు. కాబట్టి ఎవరైనా నా వంశాంకురమే. ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలకు అలా నా మనసులో అబ్బాయి పుడతాడని అభిప్రాయపడ్డాను తప్పితే నేనేమీ బాధపడడం లేదు. ముఖ్యంగా సుమతి ప్రసవ వేదన పడుతున్నప్పుడు అనిపించింది, తల్లి ఎంత కష్టపడి పిల్లలను కంటుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రసవ వేదన పడిన తల్లికి ఇద్దరూ సమానమే కదా. అప్పుడే తాను రవికి కనేటప్పుడు తన అమ్మాయిలను కనేటప్పుడు పడ్డ ప్రసవ వేదన గుర్తుకు వచ్చి తన అమ్మాయిలపై తన అభిప్రాయాన్ని మార్చుకుంది”.
అని అన్న అరుణ మాటలకు రవి కూడా తన తల్లి ఇలా మాట్లాడినందుకు సంతోషపడి అమ్మాయి పుట్టినా లేదా బాబు పుట్టినా తను కూడా సరి సమానంగా పెంచుదామని ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి సుమతికి చెప్పి సంతోషంగా అమ్మాయిని ఎత్తుకొని లాలించాడు. వారిలో వచ్చిన ఈ మార్పుకు సుమతి ఎంతగానో పొంగిపోయింది.