పర్యావరణం పరిశుభ్రత – ఒక కథ
“ఒసేయ్ రత్తాలూ ఇలా రాయే” అంటూ పిలిచాడు చంద్రం. చంద్రం ఊరిలో ఒక షావుకారి దగ్గర బరువులు ఏతే కూలి పని చేసేవాడు. రత్తాలు రోడ్లు ఊడ్చే పని చేసేది. ఇలా వాళ్లిద్దరూ పొట్ట పోసుకునే వాళ్ళు. వాళ్లకు ఒక బిడ్డ మైసమ్మ. మైసమ్మను చక్కగా చదివించాలనుకున్నారు. మైసమ్మను ప్రభుత్వ పాఠశాలలో జేర్పించారు. తల్లి చేసే పనిని చూసే మైసమ్మ ఇల్లంతా శుభ్రంగా ఉంచేది. అలాగే స్కూల్లో కూడా తన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచేది.
అదే స్కూల్లో ఒక గొప్పింటి బిడ్డ సలిల కూడా చదివేది. స్కూల్లో ప్రత్యేకంగా పిల్లలందరికీ సమయ పాలన గురించి పరిశుభ్రత గురించి చెప్పేవారు. కానీ సలిల తాను ఏ మాత్రం ఆ నియమాలను పాటించేది కాదు. పిల్లలంతా మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ తినే సమయంలో అందరూ మాట్లాడుకుంటూ లంచ్ బాక్స్ తినేవారు. మైసమ్మ తన బాక్స్ శుభ్రంచేసి ఏవైనా మిగిలిపోయిన పదార్థాలు ఉంటే వాటిని చక్కగా చెత్త బుట్టలో పడవేసేది. సలిల ఇష్టం వఛ్చినట్టు తినేసి శుభ్రం చేయకుండా చెత్త అంతా అల్లాగే ఉంచేసేది.
అరటి తొక్కలు లాంటివి కూడా తినేసి చెత్త కుండీలో వేయకుండా అక్కడ పడితే అక్కడా పడేసేది. కొన్నాళ్లుగా దీనిని మైసమ్మ గమనించింది. కానీ ఎవరికైనా చెప్పాలంటే భయపడేది. కొన్ని రోజుల తరువాత ఒకనాడు టీచర్ ఈ విషయం గమనించి సలిలను పరిశుభ్రతను పాటించాలని చెప్పింది అయినా సరే సలిల తన అలవాటును మానుకోలేక పోయింది. ఇదే అల్లవాటు ఇంట్లోనూ తాను ఎక్కడికైనా వెళ్లినా చెత్త రోడ్ల మీద వెయ్యడం మానుకోలేదు. తల్లిదండ్రులు సలిలను గారాబం చేయడంతో ఏది చెప్పినా సలిల వినిపించుకోక పోయేది.
ఇది గమనించిన టీచర్ సలిలకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు క్లాస్ పిల్లలనందరినీ అసెంబ్లీ హాల్ మీటింగుకు త్వరగా రమ్మని పిలిచారు ప్రిన్సిపాల్ గారు. పిల్లలంతా హాల్ వైపుకు వెళ్ళ సాగారు. సలిల తన హోంవర్క్ కంప్లీట్ చేయడంలో కొద్దిగా లేట్ అయినందు వల్ల మిగిలిన పిల్లలను అందుకోవడానికి త్వరగా మెట్లు దిగ సాగింది. ఆ తొందరలో తాను తిని వేసిన అరటి తొక్కపై కాలు వేగంగా పెట్టడంతో జారీ రెండు మూడు మెట్లు జారి క్రింద పడింది. దానితో సలిల చేతికి కాలుకి గాయాలయ్యాయి.
వెనుకగా వస్తున్నా టీచర్ ఇది చూసి సలిలను పైకి లేపి ఫస్ట్ ఎయిడ్ రూంకి తీసుకెళ్లి కట్టు కట్టి ” చూసావా సలిల నేను నీకు ఎన్ని సార్లో చెప్పాను. పరిశుభ్రత పాటించమని. చూసావా ఎంత ప్రమాదం తప్పిందో. చిన్న దెబ్బే తగిలింది. అదే పెద్ద ప్రమాదం జరిగితే చాలా నష్టం జరిగేది. స్కూల్లో నైనా ఎక్కడైనా పరిశుభ్రత పాటించడం నేర్చుకో. ఇలాగే నీవు అందరూ ప్రయాణించే రోడ్డు మీద కూడా వేస్తే ప్రామాదాలే కాకుండా ఆ కుళ్ళిన పదార్థాలు పై ఈగలు దోమలు లాంటి క్రిమి కీటకాదులు వచ్చ్చి అందరినీ అనారోగ్యం పాలు చేస్తాయి. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి పౌరునిది. అప్పుడే దేశం బాగుపడుతుంది. రోగాలు తగ్గుతాయి. వాతావరణం బాగు పడుతుంది. గాలి కూడా స్వచ్ఛం అవుతుంది. పర్యావరణం కూడా పరిశుభ్రమౌతుంది. చదువు లేని వాళ్ళే పరిశుభ్రత విలువ తెలుసుకొని పాటిస్తుంటే నీలా స్కూల్లో చదివే పిల్లలు తప్పకుండా పాటించాలి”
ఆ మాటలకు సలిల బుద్ధి తెచ్చుకొని టీచర్ ను క్షమాపణ అడిగి శుభ్రంగా ఉంటూ పరిశుభ్రతను పాటించడం ప్రారంభించింది.
Chandamama Shop for Kids Collection