తనదాకా వస్తే
తనవరకూ రానంత వరకు చాలా మందికి ఎదుటివాళ్ళు పడేబాధలు తెలియవు. కొంతమంది ప్రతీ విషయంలో ఎదుటివాళ్లను మాటలతో రాచి రంపాన పెడుతింటారు. వాటి పర్యవసానం వారికక్కర లేదు. అదే సమస్య వారికి వచ్చ్చినప్పుడు ఎలా వాటిని అమలుపరుస్తారో తరచి చూస్తే తెలుస్తుంది. ఎంత స్వార్థపూరితంగా ఉంటారో. తమదాకా అటువంటి సమస్యలు కానీ, కష్టాలకు కానీ వస్తేనే గాని పరిస్థితులు అర్ధం కావు. తమదాకా వస్తే తమ పరిస్థితులను తమ స్వార్థాలకు ఎలా మార్చుకుంటారో తెలియజేయడమే ఈ కథ ముఖ్య ఉద్దేశ్యం.
సూరమ్మ కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. బాల్య వివాహం జరిగి తన నడి వయస్సులోనే విధవ అయ్యింది సూరమ్మ. సూరమ్మ కోట్లాడే రకం. ప్రతీ చిన్న దానికీ పోట్లాటలకు దిగేది. నీళ్లు సరిగ్గా ఇవ్వడంలేదని పంపు దగ్గర, అద్దె సరిగ్గా ఇవ్వడం లేదని అద్దేవాళ్ళతో ఇంకా పనివాళ్ళతో బేరాలు చెయ్యడంలో గట్టిగా మంది మీద అరుస్తూ అయినదానికీ కానిదానికీ పోట్లాటలకు దిగేది. అన్యాయపు వాదనలతో ఏ మాత్రం సంకోచం లేకుండా ఇష్టం వచ్చ్చినట్లు మాట్లాడుతూండేది. తాను చేసినది తప్పయినా మాటలతో వాదనను తనవైపు తిప్పుకొనేది. ఆమె నోటికి జడుసుకొని ఎవరూ ఆమెను ఏమీ అనలేకపోయేవారు. సూరమ్మ గయ్యాళిగా పేరొందింది.
కూతురికి కొడుకుకి పెళ్లిళ్లు జరిగాయి. సూరమ్మ కోడలును సాధించడం మొదలుపెట్టింది.
తన కోడలు కూడా ఒకింటికి కూతురు అన్న విషయం గ్రహించేది కాదు. పండగకు కూతురు అల్లుడు వస్తే మంచి సొమ్ములు బట్టలు పెట్టేది. అదే తన కోడలికి ఏమి ఇచ్ఛేది పెట్టేది కాదు. పైగా ” ఏమి తెచ్చ్చావు నువ్వు పెళ్లాయ్యాక. ఏమి ఇచ్చ్చారు మీ వాళ్ళు పెళ్ళిలో. ” అంటూ శాపనార్థాలు పెట్టేది. సూరమ్మ ఎన్నడూ తన కోడలుతూ ప్రేమగా మాట్లాడింది లేదు. కోడలు చాలా నెమ్మది స్వభావం కలది. సూరమ్మ దబాయింపులకు ఎదురు తిరిగి ఏమి అనేది కాదు.
కూతురు అల్లుడు ఇంటికి వస్తే చాలా రకాల వంటలన్నీ చక్కగా వండిపెట్టేది. అదే కోడలికి కొడుకుకు ఏ ఒక్క రోజు కూడా వండక, ఇంకా కోడలు చేసిన వంటలనన్నిటికీ వంక పెడుతూ “ఇదేమి పోయేకాలము, వంట కూడా సరిగ్గా చేయరాదా” అంటూ సరిగ్గా తిండి కూడా పెట్టక పోయేది కోడలుకు.
ఇది గమనించిన కూతురి అత్తా మామలు సూరమ్మకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. సూరమ్మ ఏ మాటలతో దెప్పి పొడిచేదో అవే మాటలను సూరమ్మ కూతురిని అనడం మొదలు పెట్టారు. తాను తన కోడలిని కోడలి తల్లిదండ్రులను ఇష్టమొచ్చినట్టుగా గొంతెమ్మ కోరికలన్నీ కోరవచ్చుఁను అవి తను పంతంగా అడిగి ఇచ్ఛే వరకూ సాధించేది. అవే తన కూతురిని అడిగేసరికి వియ్యాలవారు తను ఒంటరి ఆడమనిషిని, నానాబాధలు పెడుతున్నారని గోల చేసేది .సూరమ్మ తన కూతురు బాధ పడుతుంటే చూడలేకపోయేది. తన వరకు వచ్చ్చే సరికి తను చేసిన తప్పులు ఒప్పులైపోతాయి. కోడలు చేసిన ఒప్పులు తప్పులైపోతాయి. అలా తన స్వార్థానికి మాటలు మార్చేసేది.
ఒక పండుగరోజు సూరమ్మ కోడలును దెప్పి పొడుస్తూ ఉండగా సూరమ్మ కూతురు వనజ ఇంటికి బాధపడుతూ వచ్చింది. సూరమ్మ గట్టిగా “ఏమైంది వనజా మళ్లీ నువ్వు అత్తగారింటినుంచి ఎందుకు వచ్చ్చావ్ ” అని అడుగగా “మా మామగారికి అత్తగారికి మీరు పంపిన సంబరాలు నచ్చలేదుట ఇంకా ఒక కారు ఒక కాసుల పేరు చేయించి పంపితే కానీ నన్ను ఇంటికి రానివ్వరట” అంటూ కళ్ళ నీళ్ల పర్యంతమైంది. అది వింటూనే సూరమ్మ భద్రకాళిలా లేచి గట్టిగా అరుస్తూ “మీ అత్తగారి వాళ్లకి వేరే పని లేదా ఏమిటి. ఎప్పుడూ ఎదో ఒకటి పండగకి చేసి పంపుతూనే ఉన్నాము కదా. అవి ఇంకా సరిపోవా. ఇంకా ఒక కారు కాసులపేరు తక్కువ పోయిందా” అంటూ పెద్ద ఎత్తున లేచి సరసరా రాబోతూ జారి నడుము విరగ్గొట్టుకుంది. కూతురు రాగానే కోడలును వాళ్ళ పుట్టింటికి పంపాలి అని అనుకుంటూ ఉండగా, నడుము నొప్పితో ఉన్న తనను ఎవరూ పట్టించుకోలేదు. ఆమె నోటికి జడిసినవారు ఎవ్వరూ కనీసం ఎలా ఉన్నావు అని అడగలేదు.
సూరమ్మ కోడలు మాత్రం అత్తగారికి సపర్యలు చేయసాగింది. తను దురాశతో ప్రతీ పండగకు కోడలును శాపనార్ధాలు పెడుతూ పండగ లాంఛనాలు అడిగి తన కోడలును ఎలా బాధపెట్టిందో అన్నీ గుర్తుకు రాసాగాయి. తను ప్రతీ పండగకు కోడలును తిట్టి పుట్టింటికి పంపడం, కోడలు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ వెళ్లి పోవడం, అందరూ కోడలు వెళ్ళిపోతే ఇంటి లక్ష్మి వెళ్ళిపోయినట్టే కదమ్మా అని ఇరుగు పొరుగు వెళ్లి చెప్పినా తాను వినకపోవడం గుర్తుకు వచ్చ్చి సూరమ్మ కు బుధ్ది వచ్చింది. పుట్టింటికి వచ్చ్చిన కూతురు బారెడు పొద్దెక్కినా లేవకపోవడం. తన కోడలు తనకు సేవ చేయడం చూసిన తరువాత ఇక మరెన్నడూ సూరమ్మ తన కోడలును ఏ విధమైన బాధలు పెట్టలేదు. సూటి పోటీ మాటలతో ఇక కోడలును ఎన్నడూ సతాయించలేదు. పండుగ లాంఛనాలనీ కట్నాలనీ కోడలుకు కానీ కోడలు తల్లిదండ్రులను కానీ వత్తిడి చేయలేదు.
Indian Saree collection from Chandamama