మానసిక ప్రశాంతత
ప్రశాంత్ నది దగ్గర కూర్చొని దీర్ఘoగా ఆలోచిస్తున్నాడు. అసలు ఈ జీవితం ప్రయాణం దేని గురించి. తన మనస్సులో ఏమిటివి ఈ ఆలోచనలు. మనసులో ఎదో తెలియని అలసట. ఆరాటం. తాను జీవితం సాధించాల్సినవన్నీ సాధించాడు. మరి ఎందుకని ఈ వెలితి. ప్రశాంత్ పట్టణంలో పేరు మోసిన వైద్యుడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చ్చిన వాడు. కష్టపడి చదువుకొని మెడిసిన్ చేసాడు. వైద్యరంగంలో ఒక మంచి పరిణతి చెందిన వైద్యునిగా పేరొచ్చింది. ఇంకా వివాహం కాలేదు. చేసుకోవాలని ఆత్రుత కూడా లేదు. తాను తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం. వాళ్ళు ఊరిలో ఉంటూ ప్రశాంత్ ను చదివించారు.
ప్రశాంత్ పట్టణానికి వచ్చ్చి హాస్టల్ లో ఉండి చదువుకున్నాడు. విద్యార్థి జీవితంలో తాను అర్జునుని లాగే తన లక్ష్యం మీదే దృష్టి నుంచేవాడు. ఇప్పుడు తల్లిదండ్రులు తనతో బాటు పట్టణానికి వచ్చ్చారు. ఆ సంతోషమైతే తనకు చాలా వుంది. తాను ఎం డి కూడా చేసాడు. తాను వైద్య రంగం లో చూసినది పేరు మోసిన వ్యక్తులు హాస్పిటల్ ఖర్చులు భరించగలిగే ధనవంతులని. అటువంటి వారికి వైద్యం చేసాడు. తరచి చూస్తే తనకు ఈ మానసిక లేమి దాని వల్లే అనిపిస్తోంది. తనకు ఊరిలో పోస్టింగ్ ఇస్తే కాదని పట్టణానికి మార్పించుకున్నాడు.
తాను వైద్యం అయితే చేస్తున్నాడు కానీ తనకు కావలిసిన మానసిక ప్రశాంతత దొరకలేదు. ఇదే తన మానసిక అశాంతికి కారణం అని తెలుసుకున్నాడు. వెంటనే తన ఆలోచనలకి కార్య రూపం దాల్చాడు. తల్లిదండ్రులకు చెప్పి ఊరిలో పోస్టింగ్ తాను కావాలని వేయించుకున్నాడు. అది కూడా పేద ప్రజలకు సేవ చేసే హాస్పిటల్లో. అక్కడ పని చేస్తుంటే కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు. తాను పోగొట్టుకొన్న సంతోషం మళ్ళీ వచ్చ్చినట్టయింది. సాయంత్రాలు ఉచిత వైద్యం మొదలెట్టాడు. దానితో తాను తన దేశానికే కాక తోటి గ్రామ పేద ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు కలిగిన సంతృప్తిని మారేదానితో పోల్చలేక పోయాడు. వారితో తన జీవితాన్ని పంచుకున్నాడు. వారింట వారితో బాటు జొన్నరొట్టెలు చాలీ చాలని కూరలు పచ్చళ్ళు భుజించినా విందారగించిన తృప్తిని చెందాడు.
దీనినే అంటారేమో మానసిక ప్రశాంతత అని. అక్కడ ఊరిలో పచ్చ్చని పొలాలను చూసుకుంటూ అక్కడి వారి సామాజిక కష్టాలలో పాలు పంచుకుంటూ వైద్యం చేస్తుంటే ఇక తన జీవితాన్ని ఊరిలోనే వెళ్లదీయాలనిపించింది. తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పాడు. వాళ్ళు కూడా దానికి ఎంతో సంతోషించారు. అప్పుడనిపించింది చదువుకు అసలైన న్యాయం చేయడమంటే ఇదే అని. మంచి వైద్యాన్ని పొంద లేని వాళ్లకు తనదైనా రీతిలో వైద్యం చేయడమే తనకు కలిగిన స్ఫూర్తి. మానవ సమాజానికి తనకు వీలైనంత సహాయం చేస్తూ జీవనం సాగించాడు.