కనువిప్పు
ఒక నగరంలో ఒక చిల్లర దొంగ ఉండేవాడు. వాడు చిన్నప్పుడు తన తల్లి చనిపోతే పెంచేవాళ్ళు లేక, ఎవరూ ఆదరించక చిన్న చిన్న దొంగ పనుల్లకు అలవాటు పడ్డాడు . పెద్దయ్యాక కూడా డబ్బు లేక, చదవలేక ఎవరూ పని ఇవ్వక, దొంగ గా మారాడు. . మనసు మంచివాడే కానీ పరిస్థితుల కారణంగా అల్లరి చిల్లర పనులు చేస్తూ చిల్లర దొంగగా మారాడు. తిండికి లేక తన కష్టాల కారణంగా ఈ దొంగ పనులు చేసేవాడు.
గుడికి వచ్ఛే వాళ్ళ చెప్పులు దొంగలించడం, రద్దీగా ఉన్న బస్సులో పర్సులు కొట్టేయడం మరియు గుడ్డివాడి దగ్గర డబ్బులు దొంగిలించడం ఇలాంటి చిల్లర దొంగ పనులు చేసేవాడు. దొరికిన డబ్బుతో తిండి కొనుక్కుని బయట రోడ్డుపై కానీ రైలు పట్టాల దగ్గర కానీ, పార్కులో కానీ పడుకొని జీవితాన్ని కొనసాగించేవాడు.
ఒకరోజు వాడికి ఎంత కష్టపడ్డా డబ్బులు దొరకలేదు. కానీ ఆకలి దంచేస్తోంది. ఏంచేయాలో తెలియక వస్తుంటే దారిలో ఒక ఎనిమిది తొమ్మిదేళ్ల అమ్మాయి స్కూల్ బాగ్ వేసుకొని ఒక్కతిగా రోడ్డు దగ్గర నడుచుకుంటూ రావడం దూరం నుంచి చూసాడు. వాడికి కేవలం డబ్బు కావాలి కాబట్టి ఏముంటాయి ఈ అమ్మాయి దగ్గర అని వాడు ఆ అమ్మాయిని చూడగా మేడలో ఒక సన్న దండ బంగారం దండలా అనిపించింది.
అతను ఆ అమ్మాయి దగ్గరకు వేగంగా వచ్చ్చి ఆ దండను లాక్కొని పరిగెత్తుకుంటూ పారిపోబోయాడు. ఒక్కసారిగా క్షణం లోపు అలా జరగడంతో ఆ అమ్మాయి భయపడి ఏడవడం ప్రారంభించి దొంగను పట్టుకోవడానికి అతని వెంట పరిగెత్తి సాగింది. అలానే తన వెనుక పరిగెత్తుకొస్తుందని ఊహించిన దొంగ వెనుదిరిగి చూసాడు. ఆ అమ్మాయి కుంటుతూ అతని వెనుక ఏడుస్తూ వస్తోంది. అతను అప్పుడు చూసాడు ఎందుకని అమ్మాయి వేగంగా పరిగెత్తలేకపోతోందని.
అమ్మాయి కి కుంటి కాలు ఉన్నట్టు గమనించాడు. పాపం అనిపించింది అతనికి. దగ్గరగా వచ్చ్చి “ఏదైనా తినడానికి ఉందా అని నీ దగ్గర” అని అడిగాడు. ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న బిస్కెట్స్ చాకోలెట్స్ ఇచ్చింది. “గొలుసు పోయిందని తెలిస్తే మా ఇంట్లో చాలా గొడవ జరుగుతుంది. మా అమ్మ నాన్న ఎక్కువ డబ్బులు లేని వాళ్ళు. అమ్మ ఇల్లు కట్టేవాళ్ళ దగ్గర ఇసుక మోస్తుంది. నాన్న కట్టెలు కొట్టేవాడు దగ్గర పని చేస్తాడు. వాళ్లిద్దరూ నా మీదే ఆశలు పెట్టుకొని నన్ను కష్టపడి చదివిస్తున్నారు. నాకు చిన్నప్పుడే జబ్బు చేసి కాలు విరిగింది. నేను కుంటిదాన్ని” అని చెప్పింది.
దానికి దొంగ తన సంగతులు అన్నీ ఆ అమ్మాయికి చెప్పాడు. తాను అనాధ అని తనను పెంచే వారు లేక ఇలా దొంగతనాలకు అలవాటు పడ్డానని చెప్పాడు. దానికి ఆ అమ్మాయి ” జీవితంలో చాలా మందికి అనేక రకాల సమస్యలుంటాయి. ప్రతి సమస్య ను చెడు లేదా మంచి మార్గాల ద్వారా సాధించొచ్చుఁ . మంచి మార్గములో బ్రతకడం కష్టమని చెడు మార్గాలననుసరిస్తే ఇక మనిషికి గొడ్డుకి బేధం ఏమి ఉంటుంది.
దొంగ మార్గాల వల్ల ఆఖరికి నష్టాలు కష్టాలే వస్తాయి కానీ మంచి జరుగదు. నడి వయసులో ఉన్న నీకు ఏదైనా పని దొరకక పోదు. ఈ దొంగతనాలు మాని ఏదైనా న్యాయమైన చిన్నదైనా మంచి పని చేసుకుంటే భుక్తి దొరకక పోదు. లేదంటే ప్రభుత్వం కూడా మంచి పనులు దొరికేందుకు దానికి తగ్గ చదువును కూడా ఉచితంగా బోధిస్తుంది. కొన్ని రోజులు కష్టపడితే తప్పకుండా మీకు జీవనోపాధి లభిస్తుంది ” అనేసరికి అతనికి కనువిప్పు కలిగినట్లయింది.
ఆ దండ ఆ అమ్మాయికి ఇచ్చేసి చిల్లర దొంగతనాలకు స్వస్తి చెప్పి రాత్రిళ్ళు చదువు కుంటూ పొద్దున్న కాయ కష్టం చేసాడు. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి అన్న విధంగా చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకోగలిగాడు. జీవితంలో పైకి వచ్చ్చాడు.