నిజమైన భక్తి
ఒక ఊళ్ళో సంకేత్ అనే ఒక దుడుకు స్వభావము గల అబ్బాయి ఉండేవాడు. వాడు అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఉండేవాడు. స్కూలుకు వెళ్ళేవాడు కానీ తన అల్లరి పనులతో అందరినీ అల్లరి పెట్టేవాడు. మచ్ఛుకు, తాను స్కూల్ నుండి వచ్ఛే దారిలో పొలాలు ఉండేవి. అక్కడ పనిచేసేవారి పనిముట్లు దాచేసేవాడు. వాళ్ళు వెతుకుతుండగా వాళ్ళని సతాయించి తరువాత వాటిని వాళ్ళకిచ్చేసేవాడు. ఎవరైనా సైకిల్ పక్కన పెట్టి ఏదైనా పని చేసుకుంటుంటే వాళ్ళ సైకిల్ తీసుకొని తను కొంత దూరం వరకు నడిపించి అక్కడ వదిలి వచ్చేసే వాడు. ఎవరైనా ముసలివాళ్ళు కర్ర పట్టుకుని వస్తుంటే “తాతా నాకు ఆ కర్ర ఇస్తావా నేనిప్పుడే ఐదు నిముషాల్లో ఇచ్ఛేస్తాను” అని అడిగి తీసుకొని పక్కగా పారుతున్న కాలువలో పడేసే వాడు. ఇలాంటి కోతి పనులన్నీ చేసేవాడు.
కానీ తాను ఇంటికి వెళ్లి నప్పుడు మాత్రం చాలా బుద్ధిగా ప్రవర్తించేవాడు. తల్లిదండ్రులు చాలా తమ ఒక్క కొడుకైన సంకేత్ ని గారాబంగా పెంచడమే కారణం. కానీ సంకేత్ తల్లిదండ్రులు చాలా భయభక్తులు గలవారు. సంకేత్ మీద ప్రేమ వాళ్ళ అతనిని ఏమి అనలేక పోయేవారు. వాళ్ళు చాలా దేవుడి పై భక్తి కలవారు. ప్రతీ శుక్రవారం గుడికి వెళ్ళేవాళ్ళు. తమతో బాటు సంకేత్ ని కూడా తీసుకువెళ్ళేవాళ్ళు. ఆలా సంకేత్ కి మంచి బుద్దులు వస్తాయని వాళ్ళ నమ్మకం.
ఒకరోజు ఎప్పటిలాగే సంకేత్ తన మిత్రులతో స్కూల్ నుండి వచ్చే దారిలో అల్లరి చిల్లర ఆటలు ఆడడం ప్రారంభించాడు. దారిలో ఆ రోజు గుడి పూజారి కనిపించాడు. అప్పుడు సంకేత్ కి పూజారిని సతాయించాలనిపించింది. అతను తన చేతిలో ఒక చిన్న రాయిని తీసుకొని మెల్లిగా పక్కనున్న చెట్టు ఎక్కాడు. పూజారి ఇది చూడలేదు. దారి ప్రక్కగా దారి పొడవునా చాలా చెట్లు ఉన్నాయి. పూజారి నడుచుకుంటూ వెళ్తుండగా చెట్టు పై నుండి రాయితో పూజారి పిలకను తగిలేటట్లుగా రాయితో కొట్టి చెట్ల ఆకుల మధ్య దాక్కున్నాడు. దానితో పూజారికి దెబ్బ తగిలి తలా పైకెత్తి చూసాడు. పూజారికి సంకేత్ చేసే చిల్లర పనుల గురించి చెలుసు కానీ తనకు ఎవరూ కనబడనట్టుగా వెళ్ళిపోయాడు.
మరునాడు శుక్రవారం సంకేత్ తన తల్లిదండ్రులతో గుడికి వెళ్ళాడు. ప్రసాదం ఇస్తూ పూజారి సంకేత్ ని గుర్తు పట్టి “బాగున్నావా సంకేత్, నువ్వు గుడికి ఎందుకు వస్తున్నట్టు ” అని అడిగాడు. దానికి సంకేత్ ” పూజారిగారు నేను బాగానే ఉన్నాను. నాకు దేవుడు సరైన బుద్ధి ఇవ్వాలని గుడికి వస్తున్నాని ” చెప్పాడు. దానికి పూజారి “సంకేత్ నీకు దేవుని గురించి తెలిసినట్టు లేదు. భగవంతుడు మనందరిలో ఉంటాడు. మరియు ఈ జగమంతా నిండి ఉంటాడు.
గుళ్లో దేవుని ప్రతిమ దేవుడి మహిమ తెలియజేయడానికి ఉంది. నీవు ఎవరినైనా బాధ పెడితే అది దేవుడిని దూషించినట్టే. అతనిని బాధ పెట్టినట్టే. కాబట్టి సరైనా బుద్ధి రావడం అంటే తోటి వారిని నీ లాగే భావించడం. నువ్వు ఇతరులను అల్లరి పెడితే, వాళ్ళు కూడా నీ పట్ల అలా చేస్తే నీకు ఎలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అల్లరి పనులు మానుకో. అదే నిజమైన భక్తి ” అంటూ ప్రసాదం చేతిలో పెట్టాడు. సంకేత్ కి తను పూజారిని రాయితో కొట్టిన సంగతి తెలిసినా ఏమి అనకుండా క్షమించాడని తెలుసుకొని ఆనాటి నుండి మరొకరిని అల్లరి పెట్టడం మానేసాడు.