కథ పేరు:- అందం
వెన్నెల మల్లెపూలు కురిపిస్తోంది.ఎత్తు పల్లాల ఎగుడు దిగుడు భూమి కూడా వెన్నెల్లో వెలిగిపోతోంది. ఆ నిశ్శబ్దంలో ఆనందం దుఃఖం కరచాలనం చేసుకుంటున్నాయి.వీటి మలుపులో ఆమె కుంటుతు నడుస్తోంది.ఆమె అనాకారి అనలేం కానీ అందగత్తె అని కూడా అనలేం. ఎవరో తల్లి దానం చేసిన చీర కట్టుకుంది. ఎవరో పడేసిన జాకెట్ చిరుగుల్ని కట్టుకొని వేసుకుంది.గురజాడ నాటకం కన్యాశుల్కంలో బుచ్చమ్మ లాగా ఆమె కూడా తలకు చమురు రాసుకోదు.
ఆమె ఒకందుకు చమురు ఉన్న తలకు రాసుకోదు. ఆమెకు చమురు లేక తలకు రాసుకోదు. నిజానికి ఈమెకు తల దువ్వుకోవటానికి దువ్వెన కూడా లేదు. కులాయి నీళ్లనే తలకు రాసుకొని ముడేసుకుంటుంది. ఆమెను ఎప్పుడో ఎవరో కనేసి ఎక్కడో పడేశారు. దిక్కులేని మొక్కలాగా పెరిగింది దిక్కులేని వారికి దేవుడే దిక్కని అంటారు. కానీ ఆమెను ఎప్పుడూ దేవుడు కూడా పట్టించుకున్నట్లు లేదు.ఆకలి వేసినప్పుడు రెండు వీధుల్లో బిచ్చమెత్తుకుంటే అంత అన్నం దొరుకుతుంది. పూట గడిచిపోతుంది.
ఆమె కాలు కుంటిది, కనుక ఆమె అనాకారి కాకపోయినా నడకలోని వక్రత వల్ల ఆమె ఆకారానికి వికారం తోడైంది.ఈ మధ్యనే ఆమెకు తోడు దొరికింది లేదా దొరికాడు. అతన్ని రాముడు అని ఆమె అంటుంది. అతను ఆమెను సీత అంటాడు. రాముడు మాత్రం అందగాడు కాదు. కురూపి అనటానికి తగినన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి. అతనికి ఒక కన్ను లేదు. చప్పిడి ముక్కు,కారు నలుపు,చింపిరి జుట్టు ఎప్పుడో అడుక్కునేటప్పుడు వీధిలో తారసపడ్డాడు.
పలకరింతలతో పరిచయం పెరిగింది.అనాధలకు అనుబంధం పెరిగింది. సంబంధం కుదిరింది. ఆకాశమంత పందిరి కాకపోయినా ఆకాశమే పందిరిగా భూదేవి అరుగుగా వాళ్ళు ఒకటయ్యారు. అధికారికంగా కాకుండా ప్రకృతి సాక్షిగా ఆమె అతనికి అర్ధాంగి అయింది. మనసులతో పాటు అడుక్కొచ్చింది కూడా పంచుకొని కొంతకాలం అన్యోన్యంగానే గడిపారు. క్రమంగా అతనిలో అసూయ పెరిగింది. తోటి బిచ్చగాళ్లతో సీత పలకరింపుగా మాట్లాడిన రాముడు భరించలేకపోయాడు.
సీతకు ఇది కొత్త అనుభవం ప్రపంచంలో రాకున్నా కనీసం బిచ్చగాళ్ళ సంఘంలోనైనా సోషలిజం ఉందని నమ్మేది సీత.రాముడు సీత అడుక్కొని దాచుకున్న డబ్బులు బలవంతంగా లాక్కునేవాడు. ఎదిరిస్తే కొట్టేవాడు తన్నేవాడు తాగి వచ్చి స్పృహ తప్పేటట్టుగా కొట్టేవాడు. ఆ మురికి కాలువ పక్కనే వేసుకున్న గుడిసెలో అప్పుడప్పుడు నీరసంగా నిస్సహాయంగా దిక్కులు చూస్తూ గడిపేది సీత.ఆమె పెదవులపై నవ్వు ఎప్పుడూ పూయలేదు అట్లా అని దుఃఖము లేదు.
శూన్యానికి ఏదో అదనంగా శూన్యం వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. ఆ వెన్నెల్లో మలుపు తిరుగుతూ తన జీవితంలో రాబోతున్న మలుపును గురించి ఆలోచించింది సీత. ఎట్లాంటి పర్యావసనం ఎదుర్కోవటానికైనా సిద్ధపడింది గుండె రాయి చేసుకుంది. తన గుడిసెకు కొంత దూరంలో మూలుగుతూ పడుకున్న అతని దగ్గరకు వెళ్ళింది.అతని పేరు గోవిందు బిచ్చగాళ్లకు పేరు భగవంతుడే పెడతాడు అనుకుంటాను.
గోవిందును బిచ్చగాళ్లు చూస్తే కూడా దడుసుకుంటారు.ఒక కాలు, ఒక చెయ్యి లేవు గుబురు గడ్డం అదనంగా అంటుకున్న కుష్టు రోగం.ఈ మధ్యనే అతను పరిచయమయ్యాడు. అతనిలో ఆమెకు నచ్చిన లక్షణం సౌమ్యత. దౌర్జన్యానికి అలవాటు పడిన ఆమె అతనిలోని నెమ్మదికి ఆకర్షిత్రాలైంది. అప్పుడప్పుడు తాను బిచ్చమెత్తుకొచ్చిన దాంట్లో అంత అతనికి ఇచ్చేది.అతను కృతజ్ఞతగా చూసేవాడు.రాముడు నుంచి క్రోరాన్ని మాత్రమే ప్రతిఫలంగా పొందటం అలవాటైన ఆమె గోవిందు కళ్ళలో కృతజ్ఞత చూసి కరిగిపోయేది.
ఇక రాముడికి ఉద్వాసన చెప్పి గోవిందుతో సహజీవనం చేయాలని గట్టి నిర్ణయానికి వచ్చింది. గోవిందును చెయ్యి పట్టుకొని మెల్లగా నడిపించుకుని తన గుడిసె కేసి నడిచింది. రాముడు బాగా తాగి నిద్రకు ఉపక్రమించే స్థితిలో ఉన్నాడు. అలికిడి అయ్యేసరికి కళ్ళు తెరిచి చూశాడు. నిర్భయంగా సీత గోవిందుతోపాటు గుడిసెలో అడుగు పెట్టింది. రాముడికి చెర్రెత్తింది.
ఎవడే వీడు ఎందుకు వీడిని ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు. “ఇకనుంచి గోవిందు ఇక్కడే ఉంటాడు ఇది నా గుడిసె నువ్వు ఇష్టమొచ్చినట్టు అంటే నేను పడను ఇష్టం లేకపోతే నువ్వు బయటికి నడువు” ధైర్యంగా అన్నది సీత. రాముడికి సగం మత్తు దిగిపోయింది.ఒసేయ్ఈ…. కుష్టి రోగం వాడిని ఇంత వికారంగా ఉన్నవాడి మోజులో పడి తీసుకువచ్చావా “నాలో లేండి వీడిలో నీకు ఏం కనిపించింది” ఉక్రోషంగా అన్నాడు రాముడు. సీత ఏమీ మాట్లాడలేదు గోవిందు మౌన ప్రేక్షకుడి లాగా చూస్తూ ఉన్నాడు.
మర్యాదగా ఈ దొంగ నా కొడుకును బయటికి పంపుతావా తన్నమంటావా అంటూ లేచి కాలు ఎత్తాడు రాముడు. ఊతంగా భుజాల కింద పెట్టుకున్న కర్రతో గోవిందు విసురుగా రాముడి కాలు మీద కొట్టాడు. రాముడికి పూర్తిగా మత్తు దిగిపోయింది.కాలు భరింపరాని నొప్పి పెట్టింది గోవిందుకేసి చూశాడు. గోవిందు కళ్ళలో నిప్పులు చిమ్ముతున్నాయి చంపేస్తాడేమో అన్న భయంతో గుడిసెలోంచి బయటికి గెంటి పారిపోయాడు రాముడు. గోవిందుకేసి సంతోషంగా చూసింది సీత. గోవిందు నిర్మలంగా మౌనంగా సీతకేసి చూశాడు. పారిపోతూ పారిపోతూ “వాడిలో ఏం చూసావే”అని అరిచాడు రాముడు. తను గోవిందులో ఏ అందం చూసిందో చెప్పటానికి వీలుపడక గోవిందు కళ్ళలో వెతుకుతూ ఉండిపోయింది సీత.