మానవత్వం
పద్మజ పదవ తరగతి చదువుతోంది. తను తప్పక ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలనేదే తన దృఢ సంకల్పం. తన తల్లి చాలా స్వశక్తిమీద చదువుకుంది అలాగే తన తండ్రి కూడా చాలా చిన్న క్లర్క్ ఉద్యోగం చేస్తూ తమ కుటుంబ భారాన్ని మోస్తున్న సంగతి తనకు తెలిసినదే. తన తమ్ముడు ఇంకా మూడవ క్లాస్ లో చదువుతున్నాడు. తనే ఇంట్లో పెద్దమ్మాయి. మంచి మార్కులు తెచ్చుకొని తన తమ్ముడికి ఆదర్శం కావాలనుకుంది. మొదటి రెండు రోజులు తెలుగు హిందీ పరీక్షలయ్యాయి.
మరునాడు సైన్స్ తనకు ఆ పరీక్ష అంటే చాలా భయం. తను బాగానే ప్రిపేర్ అయింది. స్కూలుకు వెళ్ళేటప్పుడు తన పెన్సిల్ బాక్స్ పేపర్లు బాగ్ అన్ని సరిగ్గా చూసుకొని గబగబా బ్రేక్ఫాస్ట్ తిని త్వరగా బస్సు ఎక్కడానికి బస్సు స్టాప్ కి వెళ్ళింది. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడుగగా అప్పు చూసుకుంది తను బస్సు పాస్ మరిచిపోయిందని. తనకిక చెమటలు పట్టినయ్ “సర్ నేను బస్సు పాస్ ఈ రోజు మర్చిపోయాను. నాకు ఈ రోజు పరీక్ష. నేను ఇంటికి వెళ్లి మళ్ళీ రావాలంటే పరీక్షకు లేట్ అయిపోతుంది. నా దగ్గర టికెట్ కొనడానికి డబ్బులు కూడా లేవు అంది”. కానీ టికెట్ కలెక్టర్ ఒప్పుకోక “టికెట్ లేనిదే బస్సు ఎక్కనీయనని. బస్సు దిగమని” చెప్పాడు.
పద్మజ మొఖం మాడి పోయింది. కళ్ళలో నీళ్లు వచ్చ్చినయ్. బస్సు ప్రయాణీకులు అందరూ చూస్తున్నారు తప్ప ఎవ్వరూ టికెట్ కొనిస్తామని అనలేదు. పద్మజ బిక్క మొఖం వేసుకొని బస్సు దిగబోతుండగా బస్సు డ్రైవర్ అన్నాడు “నేనిస్తానమ్మా టికెట్ పైసలు ఈరోజు. ఏమి పరవా లేదు. బస్సు దిగవద్దు” అంటూ పద్మజకు టికెట్ కొని డబ్బులు టికెట్ కలెక్టర్ కి ఇచ్చాడు. పద్మజ సంతోషానికి అవధులు లేవు. “చాలా థాంక్స్ సర్. మీరు ఇవ్వాళ్ళ చేసిన సహాయం నేను నా జీవితం లో మర్చిపోలేను. నేను మళ్ళీ రేపు మీ బస్సు లో వస్తే మీ టికెట్ పైసలు ఇచ్చేస్తాను” అంది సంతోషంగా.. దానికి డ్రైవర్ సరే అంటూ తల ఊపాడు. డ్రైవర్ ఆ రోజు పద్మజకు భగవంతునిలా అనిపించాడు.
ఆ రోజు పద్మజ పరీక్ష చాలా బాగా రాసింది. మళ్ళీ ఆ డ్రైవర్ బస్సు లో రాలేదు మళ్ళీ ఆ డ్రైవర్ పద్మజకు కనబడలేదు. కానీ తనని రక్షించిన డ్రైవర్ కు తను తన మనసులో కృతఙ్ఞతలు తెలియజేసుకుంది. మానవత్వం అంటే ఇదేనేమో అనుకుంది. మనుషుల్లో దేవుళ్ళు ఉంటారనే నానుడిని ఇప్పుడు తను తప్పకుండా నమ్ముతుంది. దానికి తార్కాణమే తనకు జరిగిన ఈ సంఘటన.
పద్మజ పెరిగి పెద్దయ్యాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఒకానొక సందర్భంలో తన సిబ్బందికి తనకు జరిగిన సంఘటనను తెలుపుతూ డ్రైవర్ చూపిన మానవత్వం పట్ల హర్షం వ్యక్తం చేసింది. తమ కర్తవ్య కర్మలు నిర్వహిస్తూ సాటి మనుషుల పట్ల సానుభూతి మరియు మానవత్వం చూపాల్సిందిగా తన సిబ్బందికి చెబుతూ వచ్చింది. మానవత్వం ఉంటే మానవుడే దేవుడు కావొచ్చని తెలిపింది.