పంచరత్న కీర్తనలు
కర్ణాటక సుప్రసిద్ధ సంగీత విద్వాoసులు గాయకులు మరియు వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజస్వామి పంచ రత్న కీర్తనలను రచించారు. వీటిని 18 వ శతాబ్దములో త్యాగరాజస్వామి రచించినట్లుగా తెలుస్తున్నది. ఇవి చాలా భక్తి రసం కలిగినవి. త్యాగరాజస్వామి తన భక్తిని ఈ కీర్తనలలో వర్ణించారు. ఇవి 5 రాగాలలో రచించారు. ఇవి చాలా ప్రసిద్ధికెక్కాయి కావున వీటిని పంచ రత్న కీర్తనలని పేరు గాంచాయి. పంచ అనగా ఐదు రత్న అనగా రత్నములు మణులు.
ఈ కీర్తనలు త్యాగరాజ స్వామి వారు వ్రాసిన కీర్తనలలో అత్యధిక ప్రశంసలనందుకున్నాయి. కనుక ఈ కీర్తనలు పంచ రత్న కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. ఒక మొదటి కీర్తన తప్ప మిగిలిన కీర్తనలన్నీ తెలుగు భాష లో రచింపబడ్డాయి. మొదటి కీర్తన జగదానంద కారక సంస్కృతం లో వ్రాయబడినది. ఈ కీర్తనలు అన్నీ ప్రముఖంగా శ్రీరామ చంద్రుణ్ణి కీర్తిస్తాయి. ఈ కీర్తనలు ఆది తాళంలో రచింపబడ్డాయి. వీటన్నిటిలో పల్లవి అనుపల్లవి మరియు చరణములతో మనోధర్మ సంగీతానికి ఎంతో సహకరిస్తాయి.ఈ ఐదు రాగాలు ఘన రాగములు అనగా వీణపై తానం వాయించుటకు మనోధర్మానికి ఎంతో తావు కలిగినవి. వీటిని ఘనరాగ పంచరత్నములు అని కూడా అంటారు.
మొదటి కీర్తన – జగదానంద కారక — నాట రంగం – ఆది తాళం
రెండవ కీర్తన – దుడుకుగల – గౌళ రాగం – ఆది తాళం
మూడవ కీర్తన – సాధించెనే – ఆరభి రాగం – ఆది తాళం
నాల్గవ కీర్తన – కనకన రుచిరా – వరాళి రాగం – ఆది తాళం
ఐదవ కీర్తన – ఎందరో మహానుభావులు – శ్రీరాగం – ఆది తాళం.
శ్రీత్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో జరుపబడతాయి. త్యాగరాజస్వామి జన్మ స్థలమైన తిరువయ్యురులో ప్రతీ ఏడాది త్యాగరాజ స్వామి గారి వర్ధంతి సంధర్బంగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుపబడతాయి. ఈ ఆరాధన ఉత్సవాలు ప్రసిద్ధి చెంది ఇప్పుడు ప్రపంచ దేశాలలో కూడా వీటిని జరుపుతున్నారు. వీటిలో శ్రీరాముని నామాలు స్తుతి చేయబడినవి. పంచ రత్న కీర్తనలను మరియు త్యాగరాజస్వామి విరచిత అనేక కృతులను కూడా ఈ ఆరాధన ఉత్సవాలలో ఆలపిస్తారు
ఈ కీర్తనల సంక్షిప్తంగా, మొదటి కీర్తన జగదానంద కారక లో శ్రీ రామ చంద్రుడు దేవాదిదేవుడని ముక్తి నొసగే పరమాత్ముడిని తన భక్తిని నెలకొల్పారు. రెండవ కీర్తన దుడుకుగల కీర్తనలో త్యాగరాజ స్వామి అజ్ఞాన అంధకారము దుడుకు స్వభావంతో జీవితం లో ఎలా నష్టపోతామో మరియు భగవత్ కృప తో జీవితమును ఎలా సుసాధ్యం చేసుకోవాలో వర్ణించారు. సాధించెనే కీర్తనలో విష్ణు మూర్తి కృష్ణ భగవానుని రూపంలో చేసిన కేళి విలాసములను మరియు మహాత్మ్యముల గురించి మహొద్వేగంతో కీర్తనను ఆలపించారు. భక్తుడు ఎలా భగవంతుని సమ్ముఖాన్ని సాధించాలో మరియు భగవంతుని ఎలా కీర్తించాలో ఈ కీర్తనలో పేర్కొంటారు.
కనకనరుచిరా కీర్తనలో భగవంతుడైన శ్రీ రామచంద్ర మూర్తి సౌందర్యాన్ని అభివర్ణిస్తూ భగంతుని చూసి న కొలది తన భక్తిభావం ఎలా ఉప్పోగిందో చెప్తారు.
ఐదవ కీర్తన ఎందరో మహానుభావులు కీర్తనలో నారద శౌనక మునుల నుండి మొదలుకొని అనేక మంది మహాత్ములను సాధువులను భాగవతోత్తముల గూర్చి భక్తుల గూర్చి మరియు భగవత్ సాయుధ్యాన్ని తెలిసిన వా రందరికీ తన గౌరవాలు నమస్సులు తెలియజేసారు. సామ గానంతో భగవంతుని కీర్తించినవారు ధన్యులు, భావ రాగ తాళ లయ జ్ఞానములతో దేవుణ్ణి సేవించువారు, నిజమైన పూజార్థములు తెలిసినవారు, రామాయణ గీత శృతి మొదలైన శాస్త్రముల మూల స్వరూపములు తెలుసుకొన్నవారు, సదా భగవంతుని గుణగణాలను కీర్తించుటలో నిమగ్నులై ఆనందించేవారు ,సత్యము దయగలవారు ఆ భగవానుడైన శ్రీ రామచంద్రునికి పాత్రులు కావలెనని మరియు అటువంటి ఎందరో మహానుభావులకు వందనాలు అని ఈ కీర్తన యందు శ్రీ త్యాగరాజస్వామి వారు గానం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ పంచరత్న కీర్తనలు భగవంతుని కృప చే అజరామర మవగలవు.