గయ్యాళి అత్త
ఒక ఊళ్ళో పండరీబాయి అనే ఆవిడ ఉండేది. ఆమె చాలా గయ్యాళి, ఇంకా సోమరిపోతు. ఊరందరికీ ఈ విషయం తెలుసు. ఆమె కొడుకు మోహన్ పక్క ఊర్లో ఉద్యోగం చేసే వాడు. అక్కడే ఒక అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకొని తన తల్లి ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాడు కోడలు అత్త ఒకే దగ్గర ఉంటారని. అతని భార్య మాధురి గడుసు అమ్మాయి. ఊరివారంతా పండరీబాయి తో గయ్యాళి అత్త తో ఎలా బ్రతుకుతుందో అని అనుకున్నారు.
కొన్ని రోజులకే మాధురి అత్త సంగతి తెలుసుకుంది..పొద్దున్న లేవగానే “ఒసే కోడలు పిల్లా .. ఏమి చేస్తున్నావే.. నా నడుములు విరుగుతున్నాయి.. కాఫీ తెచ్చివ్వాలని తెలియదూ ..” అంటూ సాగదీసేది. పోనిలే పెద్దావిడ కదా అని వంటింటి పంట చేసుకు వస్తే , ఇంటి పనులకు ” నాకు ఈరోజు సుస్తీగా ఉన్నదే..నువ్వే ఈరోజు పనులన్నీ చూసుకోవాలి..” అంటూ..శుబ్బరంగా తింటూ కూర్చునేది. ఇలా ప్రతిరోజు ఎదో ఒక కుంటి సాకులు..”నాకు అబ్బో ఈరోజు వీపు నొప్పి..” అని ..” “ఈరోజు ఒళ్ళు ఆంతా పీకుతున్నట్టుగా ఉన్నది ..” అనీ చెప్తుంటే మాధురికి అత్తకు ఏమి కాలేదు కానీ సాకులు చెబుతోందని అర్థమైంది.. ఎదో ఒకరోజు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది.
ఒకరోజు భర్త ఇంటికి చేరగానే చెప్పింది” అత్తకు ఎదో రోగం ఉన్నట్లుగా ఉన్నది. డాక్టర్ కు చూపిస్తే బాగుపడుతుండేది..”. మోహన్ కూడా తల్లిని డాక్టర్కు చూపించడానికి ఒప్పుకున్నాడు. పండరీబాయి ఏమి చెప్తాడో ఏమి చేస్తాడో డాక్టర్ అనుకుంటూనే వాళ్లతో బయలు దేరింది. మాధురి ముందుగానే తన స్నేహితురాలైన డాక్టర్ స్వప్నకు తన అత్త సంగతంతా అంతకు మునుపే చెప్పడంతో అత్తను పరీక్ష చేసిన తరువాత స్వప్న పండరీబాయికి అతి పెద్ద రోగముందని దానికి చాలా ఇంజెక్షన్స్లు ఇంకా ఆపరేషన్స్ కూడా చేయించాల్సి వస్తుందని చెప్పింది.
పండరీబాయికి ఇంజెక్షన్స్ అంటే చాలా భయంగా ఉండేది. ఆ విషయం విన్న పండరీబాయి భయంతో ” ఒరే మోహన్ నాకేమి కాలేదురా.. నేను ఉత్తినే నీతో నీరసంగా ఉందని, వైపు నొస్తుందని , నడుములు పోతున్నాయని చెప్పాను రా ..నాకేమి కాలేదు రా..”అని డాక్టర్ దగ్గర తన తప్పును ఒప్పుకోవడంతో మాధురి తన మనసులో నవ్వుకొని “డాక్టర్ గారు మేము కొన్ని రోజులైన తరువాత మళ్ళీ పరీక్షలకు వస్తాము. కొన్ని రోజులు దగ్గిర ఉండి నేను స్వయంగా చూసుకుంటానని” చెప్పడంతో గయ్యాళి అత్తకు బుద్ధి వచ్చి “నా కోడలు నాకు బంగారం, ఇంటికి పదండి ..” అంటూ ఇంటికి వచ్చినప్పటి నుండీ మాధురికి ఇంటి పనులలో సహాయపడసాగింది.
మరొక సారి తన ఆరోగ్యం గురించి అబద్ధం చెప్పడం పని తప్పించుకోవడానికి కుంటి సాకులు చెప్పడం మానేసింది. దానితో మాధురికి మనసు కుదుట పడింది.