మనో వికాసం
ఒకానొక పట్టణంలో ఒక స్కూల్. దానిలో 4వ తరగతిలో గంగ మంగ అనే ఇద్దరు విద్యార్థినులు చదివే వారు. వాళ్ళ ఇళ్ళు కూడా ఒకే కాలనీలో ఎదురెదురుగా ఉండేవి. వాళ్ళ వయసు కూడా దాదాపు సమానంగా ఉండేది. ఇద్దరూ స్కూల్ కు కలసి వెళ్లే వాళ్ళు కలసి వచ్చేవారు. ఇద్దరూ చదుకోవడంలో బాగా కష్టపడేవాళ్లు. కానీ గంగకు ఎప్పుడూ ఎక్కువ మార్కులు ప్రతి సబ్జెక్టులో వచ్చేవి. కారణం మంగ వాళ్ళ తల్లితండ్రులకు తెలియకపోయేది.
వచ్చే తరగతిలో మంగకు ఎక్కువ మార్కులు వస్తాయని ఆశించారు. కానీ అప్పుడు కూడా గంగకే ఎక్కువ మార్కులు రావడంతో మంగ వాళ్ళ అమ్మ ఉండబట్టలేక గంగ వాళ్ళ అమ్మను అడిగింది. “ఇది ఎలా సాధ్యపడుతుంది.. మా అమ్మాయి కూడా గంగ లాగే కష్టపడుతున్నాడు కదా . మరి ఎందుకు మంగకు తక్కు మార్కులు వస్తున్నాయని” అని.
అప్పుడు గంగ వాళ్ళ అమ్మ ఇలా చెప్పింది.. “మొదటగా నేను గంగను కూడా ఊరికే చదువుకో అని చెప్పేదాన్ని. దానితో గంగ కు మనస్తాపం ఎక్కువ అవ్వడం గమనించాను. దానితో గంగను చదవమని చెప్పడం మానేసాను. అప్పుడప్పుడు అనేదాని. కానీ వత్తిడి తీసుకురాలేదు. దానికి తోడు నేను గంగ ను ఏ విషయంలో తను ఇంటరెస్ట్ చూపుతుందో దానిని ప్రోత్సహించాను. ఉదాహరణకి గంగకు సంగీతమన్న చిత్రకళా వేయడమన్నా చాలా ఇష్టం.
కాబట్టి నేను గంగను తనకు చదువు మాత్రమే కాక తనకిష్టమైన పనులలో కళలలో ప్రోత్సహించాను. దానితో గంగ కేవలం చదువులోనే కాకుండా తన మెదడును వేరే వాటిల్లో ఉపయోగించడం ప్రారంభించింది. దానివల్ల తన మెదడును సాన పెట్టినట్లే కాకుండా మరింత చురుకుగా చదువులో రాణించింది. ఎందుకంటే తనకు కావలసిన ఇష్టమైన ఇతర విద్యలలో పిల్లలు నిమగ్నమైతే వారికి కొంత చదువుల నుండి మార్పులాగా కలిగి మనసుకు ఊరట కలుగుతుంది. మీరు కూడా మంగ విషయంలో ఇలానే ప్రయత్నించండి. ” అని చెప్పింది.
మంగ వాళ్ళ అమ్మ కూడా ఊరికే చదవమనే చెప్పకుండా మంగ కు చదువే కాకుండా ఏది ఇష్టమో తెలుసుకున్నది. అల్లాగే మంగను తన కిష్టమైన బ్యాడ్మింటన్ లో చేర్చింది. మంగకు కూడా కొంత సమయం వేరే తనకిష్టమైన క్రీడలలో నిమగ్నమవ్వగా మంగ మళ్ళీ చదువులలో చురుకుగా పాల్గొనసాగింది. తద్వారా మంగకి కూడా మంచి మార్కులు రాసాగినై. గంగ మంగ లిరువురూ నిర్ణీత సమయాల్లో చదువుకోవడం, కొంత సమయం వారి క్రీడలలో కళలకు కేటాయించ సాగారు.
పరీక్షలలో ఇద్దరూ మంచి మార్కులతో ఉత్తీర్నులయ్యారు. కాబట్టి తల్లితండ్రులు కేవలం చదువులే కాక పిల్లల మనస్తత్వాన్ని బట్టి వారిని ఇతర కళలలో క్రీడలలో ఇంకా సృజనాత్మక పనులలో వారిని ప్రోత్సహిస్తే వారి వికాసం బాగుంటుంది.