Site icon Chandamama

కష్టే ఫలి

Hindu Saint Photo by Mehmet Turgut  Kirkgoz  from Pexels: https://www.pexels.com/photo/senior-ethnic-man-in-traditional-wear-sitting-on-steps-4912651/
Reading Time: 2 minutes

కష్టే ఫలి

 అనగనగా మదనపురం అనే గ్రామంలో రామయ్య సోమయ్య అని స్నేహితులు ఉండేవారు. వారిరువురికి  పేరు ప్రఖ్యాతలు గడించాలని ఆశ వుండేది.  వీరిరువురూ యుక్త వయస్సులో ఉన్నారు. వారి గ్రామానికి ఒక సాధువు వచ్చారని ఆ సాధువు జ్యోతిష్యం బాగా చూస్తాడని చెప్తాడని గ్రామస్థులు అనుకోవడం విన్నారు. వీరిద్దరు కూడా తమ అదృష్ట జాతకాన్ని తెలుసుకోవాలని ఆ స్వామీజీ వద్దకు వెళ్లారు. “మహాత్మా  మాకు భావి జీవితం ఎలా ఉంటుందో మీరు చెప్పండి” అని అడిగారు.

ఆ మహాత్ముడు రాముడు చేతి చూసి అతను చాలా పేరు ప్రఖ్యాతులు కలవాడవుతాడని చెప్పాడు.

సోమయ్య చేతి రేఖలు చూసి ఇతను ఆనందంగా ఉంటాడు అని చెప్పాడు. దానికి వారిద్దరూ సంతోషించారు.

రామయ్య పెరిగి పెద్దవాడయ్యాక చాలా కష్టపడి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ చిన్న ఉద్యోగం నుండి చాలా కష్టపడినందులకు అతనికి మంచి రాబడి వచ్ఛే మరొక ఉద్యోగం దొరికింది. ఆ సాధువు చెప్పిన మాటలను మనసులో ఉంచుకొని మరింత కష్టపడడం ప్రారంభించాడు. దాంతో అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు లభించడమే కాకుండా త్వరలో గొప్ప ధనవంతుడయ్యాడు.

కానీ సోమయ్య మాత్రం సాధువు తనకు ఆనందమైన జీవితం ఉంటుందన్నది చెప్పాడని, తనకు దొరికిన చిన్న ఉద్యోగం కూడా సరిగ్గా చేయకుండా ఆ వఛ్చిన ఆదాయాన్ని కూడా వెనకా ముందూ ఆలోచించకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్ట సాగాడు. చూస్తుండగా అతని డబ్బంతా ఖర్చు అయిపొయింది. ఏమీ ఆదా చేయలేక బికారిగా మిగిలాడు.

మరి కొన్ని రోజులకు మళ్ళీ ఆ సాధువు తమ గ్రామానికి రాగా రామయ్య సోమయ్యలు వెళ్లి ఆ సాధువును కలిశారు. సోమయ్య ఆ సాధువుతూ “ఇదేమిటి స్వామి మీరు నేను ఆనందంగా ఉంటానని చెప్పారు..నేనేమో బికారిగా మిగిలాను ” అన్నాడు. దానికి ఆ సాధువు ఇలా చెప్పాడు ” చూడు నాయనా.. జ్యోతిష్యం కానీ అద్భుతాలు కానీ కేవలం మనకు ఒక ఉత్సాహమును ఇవ్వడానికి దిక్సూచిలా పనిచేస్తాయి కానీ ఏ కష్టం చేయకుండా కేవలం జ్యోతిష్యమును మాత్రమే ఆధారపడి జీవనం సాగిస్తే జీవన స్థాయి పెరగదు. జ్యోతిష్యమునకు తోడుగా నీ వంతు కృషి జరిపితేనే అవి సార్థకం అవుతాయి.. దానినే కష్టే ఫలి అంటారు.

కష్టపడిన వారికి తప్పక దాని ఫలితం లభిస్తుంది. రామయ్య నా జ్యోస్యం విన్నా కూడా, తన వంతు కృషి చేసాడు. కాబట్టి తన జన్మ రాసులు జ్యోతిష్యం కూడా అతనికి కలసి వచ్చాయి. భావి జీవితమును గూర్చి జన్మ రాసులను బట్టి జ్యోతిష్యం తెలుసుకున్నా దానికి సరిపోయే కృషి నీవు చేయాల్సిందే. అందుకే రామయ్య తన జీవితంలో సఫలీకృతుడు కాగలిగాడు. గీత లో శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్లుగా నీ కృషి నీ ధర్మం నీవు చేయి. ఫలితం భగవంతునికి వదిలివేయి. అతను తప్పక ఇస్తాడు” అని సోమయ్య సంశయాన్ని తొలగించాడు,

చూసారా భావి జీవితం గూర్చి ముందుగానే తెలుసుకున్నా,  మన కృషి ఉంటేనే అవి సఫలీకృతం అవుతాయి. సోమయ్య లాగా సోమరిగా బ్రతికితే జీవితంలో ఏదీ సాధించలేము.

Exit mobile version