అట్ల తద్ది
అట్ల తద్ది.. తెలుగు వారి ముఖ్య పండుగల్లో ఇది కూడా ఒకటి. ఈ పండుగను అట్ల తదియ అని కూడా అంటారు. ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. “అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు” అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు. ఎంతో సందడిగా జరిగే ఈ పండగ ఈ సారి నవంబరు 03 అంటే మంగళవారం రాబోతుంది.
అట్ల తద్ది
పిల్లల నుంచి పెద్దల వరకు..
పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇందులో ఏటా జరుపుకునే అట్లతద్ది నోము ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పంముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది చేసుకుంటారు.
మంచి భర్తలు రావాలని పూజలు చేస్తారు..
అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు, అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజచేసి ముత్తైదవులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం.
కుజదోషం తొలుగుతుంది..
ఇందులో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ పండగలో అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవ గ్రహాలలో కుజుడుకీ అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగాపెడితే కుజదోషం పరిహారమై సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. రజోదయానికి కారకుడు కాబట్టి రుతుచక్రం సక్రమంగా ఉంచి రుతుసమస్యలు రాకుండా కాపాడుతాడు. దీంతో గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఈ రోజు ఏ పనులు చేయాలి..
అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి.ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి తామూ భోజనం చేయాలి.
అన్ని పదిసార్లే..
పది రకాల పండ్లను తినడం.. పదిమార్లు తాంబులం వేసుకోవడం. పదిసార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం ఈ పండగలో విశేషం. దీన్నే ఊయ్యల పండగ అని, గోరింటాకు పండగ అని కూడా అంటారు. ఈ పండుగ వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి అవివాహిత యువతులకు గుణవంతుడు, అందగాడైన వ్యక్తిని భర్తగా లభిస్తాడని, పెళ్లైన వారికి సంతానం కలుగుతుందని, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.