Site icon Chandamama

స్వయం శక్తి – సంకల్ప బలం

Will Power @pexels.com
Reading Time: < 1 minute

స్వయం శక్తి – సంకల్ప బలం

వేదాంతంలో కస్తూరీ మృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపు వాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలు పెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. 

పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి ‘నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.’ అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.

అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

‘అదేంటి బావా? ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని వారు అడుగుతారు.

దానికి కృష్ణుడు నవ్వి.’ బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?’ అంటాడు.

ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.

మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు. అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు. తపస్సు అంటేనే ధ్యానం . ధ్యానం ద్వారానే జ్ఞానసిద్ధిని పొందారు.

ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు.

అలా కాకుండా స్వయంగా ఆలోచించడం అభ్యాసం చెయ్యటం అలవాటు చేసుకుంటే 95% సమస్యలు లెక్కలోకి రావు. ఆ ఆత్మ విశ్వాసంతో సమస్యలయిన ఆ 5% కూడా అధిగమించేయవచ్చు.

 అంటే స్వయంశక్తితో సంకల్ప బలంతో దేన్నయినా అధిగమించేయవచ్చన్నమాట.

More Telugu Stories – Click Here

Exit mobile version