మంచినీళ్ళ పంపు దగ్గర నుంచొని ఉన్నాడు బుల్లిగాడు చేతిలో ఒక పాత డ్రింక్ సీసా తో.వాడి ముందు ఇంక ఇద్దరు బిందెలతో ఉన్నారు. ఏంటిరా!మీ అమ్మ కి ఇంక జొరం తగ్గలేదా? నువ్వొచ్చావు? మీ ఇంటికాడ కూడా ఓ బిందె పోస్తాములే! నువ్వు పొయ్యి ఉరిలో అన్నదానమంట.. పప్పుబువ్వెడతారు రెండు గిన్నెలట్టుకు పో, మీ అమ్మక్కూడా అడిగి తే, పోర బేగి.. అంటూ తొందరపెట్టారు .
పంపుకాడ్నించి ఇంటికొచ్చే లోపే వాళ్ల బజార్లో పిల్లలందరూ చేతుల్లో లోటాలు, సత్తుగిన్నెలు,లోటాలు పుచ్చుకొని పరుగులు పెడుతున్నారు ఊళ్ళోకి. బుల్లిగాడు ఇంటికెళ్లాలీ..గిన్నెలు తీసుకొని రావాలి.బుల్లిగాడిగి కంగారెక్కువై పోతాంది. చేతిలో ఉన్న ఖాళీ సీసా జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి పరుగు తీసాడు. వాడు కంగారు లో కింద చూసుకోలేదు.
రాయి తగిలి కింద పడనే పడ్డాడు.మోకాళ్ళు డోక్కుపోయి రక్తం వస్తాంది కానీ వాడు పట్టించుకోలేదు.ధ్యాసంతా పప్పుబువ్వ మీదే ఉంది. గబగబా ఇంట్లో కి వెళ్లి రెండు సత్తు గిన్నెలు తీసుకొని అమ్మ కి చెప్తూనే బయటకి ఉరికాడు. యింకా కొంతమంది పిల్లలు అటువైపుగా వెళ్తున్నారు. పరుగెత్తుతా వెళ్లి వాళ్లతో కలిసాడు.దూరం నుంచే మంచి మంచి వాసనలొస్తా ఉన్నాయి.
పిల్లలందరూ హుషారుగా పరిగెత్తారు.బుల్లిగాడు కూడా జారిపోతున్న నిక్కరు పైకి లాక్కుంటూ పరుగు తీసాడు. చాలా దూరం నుంచే ఆటో లు, కారులు ఆగి ఉన్నాయి. తన తోటి వాళ్ళు దారిలో చెప్పిందాన్ని బట్టి పెద్ద గురువు గారు వచ్చి ఏవో మంచి మాటలు చెప్తారంట. అవేంటో తనకి తెలీదు కానీ బుల్లిగాడి మనసంతా బువ్వ మీదే ఉంది.
ఈరోజన్నా బువ్వ తినొచ్చు. అమ్మ కి జొరంగా ఉండి పనికెల్లటం లేదు,రెండు రోజులనుంచి అన్నం వండలేదు. నిన్న పక్కింటి అవ్వ సంకటి పెట్టింది. ఈరోజు కడుపు ఖాళీ, ఆకలి ని ఓర్చుకోవటం కూడా తెలుసు ఐదేళ్ళ బుల్లిగాడికి.పిల్లల తో కలిసి గేటు దగ్గరే నుంచున్నాడు కానీ ఇందాక తగిలిన దెబ్బలు సలుపుతన్నాయి ,కింద చెప్పుల్లేక కాళ్లు మండిపోతున్నాయి. వాడికి ఇంకో బెంగ కూడా ఉంది, అదేంటంటే తను తెచ్చిన గిన్నెలు సరిపోతాయా ,ఒకవేళ యింకా పెడితే ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి అని వాడి చిన్ని బుర్ర తెగ ఆలోచిస్తాంది .
యింకా మైకు లో ఎవో చెప్తూనే ఉన్నారు, అక్కడ పిల్లల బుర్రకి ఏమీ ఎక్కటం లేదు. వాళ్ల లెక్క ప్రకారం మైకు ఆగిన కాసేపటికి అక్కడి వాళ్ళు తిన్న తర్వాత వీళ్ళని పిలుస్తారు. కాసేపట్లో మైకు ఆగింది. భోజనాలు జరుగుతున్నట్లు గిన్నెల చప్పుళ్లు మొదలయ్యాయి. పిల్లలందరూ సిద్ధం గా ఉన్నారు ఎప్పుడు పిలుస్తారా అని. ఒకొక్కరుగా బయటికి వచ్చి వాళ్లవాళ్ళ బండ్ల లో వెళ్లిపోతున్నారు. ఎంతసేపటికీ గేటు దగ్గర పిల్లల కి పిలిపు రాలేదు.
ప్రతిసారి అక్కడ ఉండే వాచ్మెను తాత అందరి భోజనాలు అయ్యేక తమని పిలిసేవాడు,కానీ ఇప్పుడు తాత కూడా కనపడలేదు ఏంటా అని పిల్లలందరూ ఎదురుచూస్తున్నారు.ఇంతలో తాత వచ్చాడు నీరసంగా,ఈరోజు ఏమీ మిగల్లేదు పిల్లలూ,వెళ్ళిపోండి ఇక్కడనుంచి . మళ్ళీ పెద్దసారు చూస్తే కుక్కల్ని వదలమంటారు అన్నాడు.పిల్లలందరూ ఉసూరుమంటూ ఇళ్ళకి దారి తీసారు. సుష్టుగా భోజనం చేసిన ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.
“గురువు గారు ఎంత బాగా చెప్పారు!! ప్రతి జీవి లో నూ దేవుడ్ని చూడమని?”