అయ్యప్పస్వామిని మనం ఎక్కడ చూసినా, విగ్రహమైనా, చిత్రపటమైనా ఆయన పీఠంపై కూర్చుని ఉన్నప్పుడు ఆయన కాళ్లకు ఒక పట్టీ ఉంటుంది. అయితే ఆ పట్టీ ఎందుకు వచ్చిందో, అయ్యప్ప స్వామి ఆ పట్టీని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామికి మణికంఠుడనే ఇంకో పేరుందని అందరికీ తెలిసిందే. అయితే అదే పేరుతో ఆయన పందళ రాజు వద్ద 12 సంవత్సరాలు పెరుగుతాడు. ఆ క్రమంలో తాను హరిహర సుతుడనని తెలుసుకుంటాడు.
ధర్మాన్ని శాసించడం కోసం తాను జన్మించాననే విషయాన్ని నారద మహర్షి ద్వారా గ్రహిస్తాడు. అనంతరం మహిషిని అయ్యప్ప వధిస్తాడు. తరువాత శబరిమల ఆలయంలో జ్ఞాన పీఠంపై స్వామి కూర్చుంటాడు. అయితే అలా అయ్యప్ప స్వామి శబరిమలలో 18 మెట్ల పైన జ్ఞాన పీఠంపై కూర్చుని ఉన్నప్పుడు పందళ రాజు అయ్యప్ప కోసం వస్తాడు. ఈ క్రమంలో పందళరాజు 18 మెట్లు ఎక్కి అయ్యప్పను చేరుకునే సమయంలో అయ్యప్ప లేచి నిలబడేందుకు యత్నిస్తాడు.
అయితే అప్పుడు అయ్యప్ప పట్టు తప్పి పడిపోబోతాడు. దీంతో పందళరాజు అది చూసి తన వద్ద ఉన్న పట్టు పట్టీని స్వామి వారి కాళ్లకు కడతాడు. అనంతరం స్వామి పడిపోకుండా ఉంటాడు. దీంతో పందళరాజు స్వామిని ఎప్పటికీ ఆ పట్టీతోనే ఉండాలని కోరుతాడు. అందుకు అయ్యప్ప స్వామి అంగీకరించి పందళరాజుకు వరం ఇస్తాడు. అలా అయ్యప్ప ఇప్పటికీ మనకు కాళ్లకు పట్టీతోనే దర్శనమిస్తాడు. ఇదీ.. ఆయన పట్టీ వెనుక ఉన్న కథ..!