వెల్లాయి గోపురం

వెల్లాయి గోపురం
Reading Time: 2 minutes

పూర్వం శ్రీరంగంలో వెల్లాయి అనే ఒక దేవదేసి ఉండేది. నాట్య గానాలలోనూ చతురతలోనూ ఆమెకు సాటి ఎవరూలేరు. ఆమె చాలా చిన్నతనం నుండే శ్రీరంగనాధ స్వామి సేవకు అంకితం అయింది. ఆమె ఎంతటివారినైనా తన చతురతతో ఇట్టే మెప్పించేది. అయితే శ్రీరంగం మీద అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైనికులు ఆతని సైన్యాధిపతులు దాడులు జరిపి పదివేలమంది బ్రాహ్మణులను ఊచకోత కోసి ఆలయం మీద దాడి జరిపినపుడు ప్రతిఘటించిన మరో 12000 మంది ప్రజలను కూడా ఊచకోతకోసి ఆలయములోని విలువైన నగలు, సంపద అంతా దోచారు.

TALE OF A TOWER: The Eastern Gopuram which stands testimony to the poignant tale of Vellayi, in the Srirangam Temple. Photo: S.R. Raghunathan
Photo: S.R. Raghunathan

అక్కడ ఉన్న విగ్రహాలు పూర్తిగా స్వర్ణమయం. వాటినీ డిల్లీకి తీసుకుని పోవాలని వారు గుడి అంతా వెదికారు. కానీ ఆ విగ్రహాలను పిళ్లై లోకాచార్యులు రాత్రికి రాత్రే ఆ విగ్రహాలను తీసుకుని మారు వేషాలలో మధురకు పారి పోయారు. ఆ విగ్రహాల కోసం మరియు పిళ్లై లోకాచార్యుల కోసం చాలానే వెదికించారు ఆ ముష్కరులు. పిళ్లై లోకాచార్యులు తరువాత ఆ విగ్రహాలను తిరునల్వేలికి తీసుకుని పోతూ మార్గ మధ్యమములో అనారోగ్యంతో మరణించారు. తరువాత ఆయన శిష్యులు ఆ విగ్రహాలను తిరుపతికి చేర్చారు. ఆలా 1323 లో బయటకు వెళ్ళిన విగ్రహాలు దాదాపు 1371 వరకూ తిరిగి ఆలయాన్ని చేరలేదు.

ఇది ఇలా ఉంటె, శ్రీరంగం ఆలయం మీద దండయాత్ర చేసినపుడు ఆలయం బయట ఆ ఆలయములో నాట్యం చేసే దేవదాసి వెల్లాయి వెంటనే తన వాద్య గాత్ర పండితుల సహాకారముతో ఓ శృంగార నాట్య ప్రదర్శన చాతుర్యంగా ఏర్పాటు చేసింది. సైన్యాధిపతి మరియు అనేక మంది సైనికులు ఆమె శృంగార నాట్యం అందం చూసి విచలితులయ్యారు.

ఆమె నాట్యం గంటలకొద్దీ సాగింది .ఈ సమయములోనే పిళ్లై లోకాచార్యులు సైనికుల కనుగప్పి ఆ విగ్రహాలను తీసుకుని మారువేషములో మధురకు పారిపోయారు. వెల్లాయి అందం హొయలు చూసి విచలితుడై ఆమె వెంటబడిన సైన్యాధిపతిని అటు ఇటు అంటూ తూర్పు గోపురం ప్రాంతానికి తీసుకుని పోయింది .అక్కడ మెల్లగా గోపురం పైకి తన చతురతో విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను రమ్మంటూ తూర్పు గోపురం మీదకు తీసుకుని పోయి ఆతణ్ణి అక్కడ నుండి తోసి వేసింది.

తానూ ఆ ముష్కరుల చేతిలో బందీ అవడం ఇష్టం లేక ఆ గోపురం మీద నుండి రంగనాథుని తలుస్తూ దూకి చనిపోయింది.

మధుర సుల్తానులని ఓడించిన కుమార కంప రాయలు ఆలయాన్ని వేదాంత దేశికుల వారి సాయముతో పునరుద్ధరింప చేసారు. ఇక విజయనగర పాలకులు ఆలయములో యథావిధిగా పూజావిధుల ఏర్పాటు చేశారు.

తిరుపతిలో దాచి యున్న రంగనాథ స్వామి విగ్రహాన్ని తరువాత హరిహర బుక్కరాయల సహాయముతో తీసుకుని వేదాంత దేశికులవారు శ్రీరంగములో పున: ప్రతిష్టించారు. దీనికి అంతటికీ వెనుక ఉండి నడిపించినది విద్యారణ్యులు మరియు విజయనగర సైన్యాధిపతిగా ఉన్న అభినవ ద్రోణాచార్య బిరుదాంకితుడు అయిన గోపనాచార్యులు.

నాడు స్వామి వారి విగ్రహాలను సంరక్షించేందులకు తన ప్రాణాలకు సైతం వెరువక త్యాగం చేసిన దేవదాసి వెల్లాయి గుర్తుగా ఆ తూర్పు గోపురాన్ని పునరుద్ధరించి కంపరాయలు ఆమె పేరుతో వెల్లాయి గోపురం అని పేరు పెట్టించారు.

ఆ గోపురానికి సున్నం వేసి నేటికీ వెల్లాయి గోపురంగా పిలుస్తారు.

Leave a Reply