డ్యూరియన్ పండు

Reading Time: 3 minutes

                      చూడటానికి పనసకాయ లాగా,పెద్ద ఉమ్మెత్తకాయ లాగా ఉండే ఈ పండు,మాల్వేసి కుటుంబానికి చెందినది.మలేసియా,బోర్నియో,ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలలో విరివిగా పండుతుంది.డ్యూరియో ప్రజాతి(genus) కి చెందిన ఈ పండులో ముఫ్పై జాతులు(species) ఉన్నాయి.అయితే వీటిలో తొమ్మిది జాతులు మాత్రమే తినదగినవి అని చెబుతారు.వీటిలో ప్రపంచవ్యాప్తంగా లభించే జాతి డ్యూరియో జిబెంథస్.”డ్యూరీ” అంటే మలయా భాష లో “ముల్లు” అని అర్థం.పండు మీద ఉండే ముళ్ళ వంటి వాటి వల్ల ఈ పేరు వచ్చింది.ఈ పళ్ళ వాసన పునుగు పిల్లి(Viverra zibenthus) నుంచి వచ్చే వాసనను పోలి ఉండడం వల్ల జిబెంథస్ జాతికి ఆ పేరు వచ్చింది.పునుగు పిల్లులకు ఈ పళ్ళ వాసన ఇష్టమనీ, పూర్వ కాలంలో పునుగు పిల్లులను పట్టుకోవడానికి ఈ పళ్ళను ఎరగా వాడేవారనీ,అందుకే జిబెంథస్ జాతికి ఆ పేరు వచ్చిందనీ కొందరు చెబుతారు.

Durian Fruit
Durian Fruit – Wikipedia

                    పదిహేనవ శతాబ్దంలో  ఇటలీ దేశానికి చెందిన నికోల్ డి కోంటి అనే వర్తకుడు సముద్రయానం చేస్తూ,ఆగ్నేయాసియా దేశాలకు వచ్చినప్పుడు ఈ పండును మొదటి సారిగా రుచి చూశాడు.తరువాత ఈ పండు నెమ్మదిగా ఐరోపా,ఆస్ట్రేలియా మొదలగు దేశాలకు విస్తరించింది.

                   ఈ పండు యొక్క చెట్టు దరిదాపుగా ఎనభై నుంచి నూట అరవై అడుగుల ఎత్తు పెరుగుతుంది.ఈ చెట్లు సతత హరిత(ever green) చెట్లు.ఉష్ణ ప్రాంతాల్లో పెరుగుతాయి.ఒకవేళ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీలకంటే తక్కువగా ఉంటే చెట్టు పెరుగుదల ఆగిపోతుంది.పువ్వులు తెలుపు రంగు లో ఉండి,గుత్తులు గా ,నేరుగా కాండానికి పూస్తాయి.ఒక గుత్తి కి మూడు నుంచి ముఫ్పై పూల వరకు ఉంటాయి.పళ్ళు తినే గబ్బిలాలు వీటిని ఫలదీకరణం(pollination) చేస్తాయి.తేనెటీగల వల్ల కూడా ఫలదీకరణం జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఉడుతలు,పందులు,ఎలుకలు వంటి జంతువుల వల్ల కూడా విత్తన బదిలీ జరిగి కొత్త మొక్కలు వస్తాయి.విత్తనం నాటిన ఐదేళ్ళ తరువాత నుంచి సంవత్సరానికి ఒకటి లేదా రెండు కాపులు వస్తాయి.ఫలదీకరణ చెందిన తరువాత మూడు నెలలకు  కాయ కోతకు సిధ్ధం అవుతుంది.జూన్ నుంచి ఆగష్టు నెలల వరకు కాపు వస్తుంది.

                    డ్యూరియన్ పండు ఒక్కోటీ దరిదాపుగా మూడు కేజీల బరువు ఉంటుంది.ఒక్కొక్క పండు లో పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే గుజ్జు ఉంటుంది.సాధారణంగా చెట్టుకి పండి కిందకు రాలిన కాయలను రైతులు సేకరిస్తారు.అయితే పండు కిందకు రాలే సమయంలో కింద ఎవరైనా ఉంటే,ఈ పండు మీద ఉండే ముళ్ళ వల్ల తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది.చిన్నపిల్లలకు ప్రాణహాని కూడా ఉంటుంది.అందుకే రైతులు చెట్లకు నేల నుంచి కొంచెం ఎత్తు లో వలలు వేలాడదీస్తారు.పళ్ళు రాలి నేరు గా ఈ వలల్లో పడతాయి.పండు తెరిస్తే లోపల నాలుగైదు పెద్ద తొనలు ఉంటాయి.అవి పసుపు నుండి ఎరుపు రంగు లో ఉండి,వెన్న లాగా మృదువు గా ఉంటాయి.ఈ తొనల లోపల రెండు బద్దలు ఉన్న విత్తనాలు ఉంటాయి.

                     డ్యూరియన్ కాయలు చేదుగా ఉండి,కుళ్ళిన ఉల్లిపాయలు లేదా టర్పెంటైన్ వాసన కలిగి ఉంటాయి.అందుకే చాలా దేశాలలో  ప్రజా రవాణా వాహనాల్లోనూ,ఫలహారశాలల్లోనూ వీటిని నిషేధించారు.ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో ఈ కాయలను కూరగాయ లాగా వండుకుని తింటారు.పండే కొద్దీ కాయ లోని చేదు తగ్గి దుర్గంధం పెరుగుతుంది.పండు యొక్క వాసన దుర్భరంగా ఉన్నా,తినడానికి చాలా తియ్యగా,రుచిగా ఉంటుందని చెబుతారు.పండు యొక్క గుజ్జుని చాలా రకాల తీపి పదార్థాలలో వినియోగిస్తారు.కొందరు విత్తనాలను కూడా ఉడకబెట్టుకుని,లేదా వేయించుకుని తింటారు.పచ్చి విత్తనాలలోని సైక్లోప్రోపీన్ కొవ్వు ఆమ్లాలు మొదలగు హానికర రసాయనాలు ఉండడం వలన విత్తనాలను పచ్చిగా తినకూడదు అని చెబుతారు.

Durian Fruit
Durian Fruit – wikipedia

                       డ్యూరియన్ మరియు పత్తి మొక్కల జన్యు పటాలకి చాలా పోలికలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.పండు లో ఉన్న ” మిథియోనిన్ గామా లయేజెస్” అనే ఎంజైములు పండు లోని ఆర్గానో సల్ఫర్ రసాయనాల మీద పని చేయడం వల్ల పండు నుంచి ఆ విభిన్నమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఇథేన్థయోల్ రసాయనం వల్ల పండునుంచి  ఆ దుర్గంధం వెలువడుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఈ పండు మన శరీరంలోని ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ ఎంజైమును నిర్వీర్యం చేస్తుందనీ,అందువలన మద్యం తీసుకుంటే శరీరంలోనే పేరుకుపోతుందని కనుగొన్నారు.అందుకే ఈ పండును మద్యంతో పాటు తీసుకోకూడదని చెబుతారు.ఈ పండును తిన్నప్పుడు శరీరానికి విష పదార్థాలను బయటికి విసర్జించే శక్తి తగ్గిపోతుందనీ,అందుకే ఈ పండును మితంగా తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతారు.

                       డ్యూరియన్ పండులో ఇనుము,కాల్షియం మొదలగు ఖనిజాలు,విటమిన్లు,శరీరానికి మేలు చేసే ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.కానీ దీనిలో ఉండే మోనో శాట్యురేటెడ్ కొవ్వుల వల్ల శరీరంలో కొవ్వు నిలువలు పెరిగిపోతాయి.గర్భిణులు,రక్తపోటు ఉన్నవారు ఈ పండును తినకూడదని చెబుతారు.ఈ చెట్టు యొక్క ఆకులు,వేర్ల నుంచి తీసిన కషాయాన్ని నుదుటికి పట్టు వేస్తే జ్వరం తగ్గుతుందని మలేషియన్లు నమ్ముతారు.

                       వియత్నాం లో పండే “ముసాంగ్ కింగ్”,థాయ్ లాండ్ లో పండే “మోన్ థాంగ్” రకాలు చాలా ప్రసిధ్ధి చెందినవి.మోన్ థాంగ్ అంటే థాయ్ భాషలో “బంగారు దిండు” అని అర్థం.థాయ్ లాండ్ ప్రభుత్వ సైంటిస్టు, డా.సోంగ్ పోల్ గారు,కొన్ని జాతులను సంకరీకరణ చేయడం ద్వారా “చాంటాబురి” అనే కొత్త రకం డ్యూరియన్ ని కనుగొన్నారు.ఈ రకానికి చెందిన పళ్ళనుండి దుర్గంధం వెలువడదు.మలేషియా లో “డ్యూరియన్ ఐఓఐ” అనే రకాన్ని విరివి గా పండిస్తారు.సింగపూర్ దేశంలోని “ఎస్ప్లనేడ్” అను కట్టడం ఈ పండును పోలి ఉండటం వలన దానిని ముద్దు గా ఆ దేశస్తులు డ్యూరియన్ అని పిలుచుకుంటారు.

                      బాగా మగ్గిన డ్యూరియన్ ను తాటిబెల్లం తో ఉడకబెట్టి చేసే “గువాన్” అనే తీపి పదార్ధం థాయ్ వాసుల ప్రత్యేక వంటకం.గుజ్జును ఎండబెట్టి చేసే చిప్సును “క్రిపిక్ డ్యూరియన్” అంటారు.”పులుత్ డ్యూరియన్” అనే వంటకంలో బియ్యాన్ని కొబ్బరి పాలతో ఉడికించి,బాగా  పండిన డ్యూరియన్ తో కలిపి తీసుకుంటారు.దీని గుజ్జు తో క్యాండీలు,ఐస్ క్రీములు,మిల్క్ షేకులు కూడా తయారు చేస్తారు.

                   మన దేశంలో ఊటీ నుంచి కోయంబత్తూరు వెళ్ళే దారిలో ఎన్ హెచ్ 67 మీద ఉన్న  “బుర్లియర్ స్టేట్ హార్టీకల్చర్ ఫామ్” లో డ్యూరియన్ పళ్ళను సాగు చేస్తున్నారు.మీకు అవకాశం ఉంటే డ్యూరియన్ పండును తప్పకుండా రుచి చూడండి.

Leave a Reply