Source: Andhrajyothi https://lit.andhrajyothy.com/mahabharatham
రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి.
కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా.
ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ “ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?” అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం.
అంతేకాదు..కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి.
వారందరి కోసం “మహాభారతం” మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది.
ఎక్కడో ద్వారక.
దానికి చాలా దూరంలో తపోవనం.
ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.
ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు.
మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు…కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు.
అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు.
అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి (ఇప్పటి కరోనాలాగనే అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది–అది వేరే కథ..ఆ కథంతా ఇక్కడ చెప్పట్లేదు).
ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.
అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు.
శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.
అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ.
మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవారూ చెప్పలేరు.
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక.
Please translate in Kannada or hindi and publish
Thank you for the feedback. Any volunteers to take up this project?