మనుస్మృతి నందలి మానవ నియమాలు

Reading Time: 2 minutes
Manusmruthi

మనుస్మృతి నందలి మానవ నియమాలు

  • మన శక్త్యానుసారముగా ఇల్లు , వాకిలి , వంట మొదలగునవి లేని బ్రహ్మచారులకు , సన్యాసులకు గృహస్థులు ఆహారాదులు ఇవ్వవలెను. మరియు ఆవు , కుక్క మొదలగు ప్రాణకోటికి కూడా ఆహారాదులు ఇవ్వవలెను.
  • ఉదయించు సూర్యునిని , అస్తమించు సుర్యునిని , గ్రహణ సమయములో సుర్యునిని , నీటిలో సూర్యబింబమును , ఆకాశమున మధ్యాహ్న సమయము నందు సూర్యుడిని సరాసరి చూడరాదు.
  • దూడని కట్టిన తాడును దాటరాదు. వర్షము కురియునప్పుడు పరిగెట్టరాదు. నీటిలో తనరూపమును తాను చూడరాదు.
  • ఒకే వస్త్రముతో భుజించరాదు. శరీరం పైన ఒక్క వస్త్రము కూడా లేకుండా స్నానం చేయరాదు . నడిచేదారిలో మూత్రవిసర్జన చేయరాదు . అదే విధముగా బూడిదలో కాని , స్మశానంలో శవభస్మం పైన కాని గోశాల యందు కాని మూత్రవిసర్జన చేయరాదు .
  • దున్నిన పొలములో గాని , నీటిలోను , యజ్ఞకుండము నందు గాని , పర్వతము నందు గాని , ప్రాచీన దేవాలయముల నందు గాని పుట్టలలో గాని ఎన్నటికి మూత్రవిసర్జన చేయరాదు .
  • జీవులున్న కన్నములలో , నడుచుచూ నిలబడియు , నది ఒడ్డున కూర్చొని , పర్వత శిఖరంపై మూత్రవిసర్జన చేయరాదు .
  • అగ్నిని నోటితో ఊదరాదు. అగ్నియందు అపవిత్రమైన వస్తువులు వేయరాదు . అగ్నితో పాదములను కాచరాదు . మంచము క్రింద అగ్నిని ఉంచరాదు. నిప్పుపైనుండి దాటరాదు , కాలితో నిప్పుని రుద్ది ఆర్పరాదు.
  • నీటిలో మలమూత్రములు , ఉమ్మిని విడువరాదు . అపవిత్ర వస్తువును గాని , రక్తంగాని , విషముతో కూడిన వస్తువులు గాని నీటియందు విడవరాదు.
  • శూన్యగృహము నందు ఒంటరిగా నిద్రించరాదు . నిద్రించువారిని లేపరాదు. రజస్వల స్త్రీతో మాట్లాడరాదు. పిలువబడకుండా యజ్ఞములలో పాల్గొనరాదు.
  • ఎక్కువుగా నూనెతో కూడిన పదార్థములను భుజించరాదు . మిక్కిలి త్వరగా కాని , ఆలస్యముగా కాని భుజించరాదు . ప్రాతఃకాలము నందు అతిగా భుజించిన సాయంకాలము నందు తినరాదు.
  • నిరర్ధకముగా పనిచేయరాదు . దోసిలితో నీరు తాగరాదు. ఒడిలో పెట్టుకుని పదార్థములను తినరాదు. ప్రయోజనము లేని మాటలను వినరాదు.
  • ఎన్నడూ కంచుపాత్రలో కాళ్లు కడగరాదు. పగిలినపాత్రలో భుజించరాదు . కపటమనస్కుల ఇంట భుజించరాదు .
  • చెప్పులు , గుడ్డలు ఇతరులు ధరించినవి ధరింపరాదు. యజ్ఞోపవీతం , నగలు , పూలదండ , కమండలం కూడా ఇతరులవి వాడరాదు.
  • ప్రాతఃకాలపు ఎండ , శవమును కాల్చునప్పుడు వచ్చు పొగ శరీరముకు తగలనివ్వకూడదు. విరిగిన ఆసనములపై కూర్చుండరాదు. శరీరం పైనున్న వెంట్రుకలను గోళ్ళతో పీకరాదు . పళ్లతో గోళ్లు కొరకరాదు.
  • చేతివేళ్ళతో మట్టిపెళ్లలను , ఇటుకలను పగలగొట్టరాదు. గడ్డిపోచలు తుంచరాదు. నిష్ఫలమైన కర్మ చేయరాదు . అట్టిది భవిష్యత్ లో దుఖఃకారణం అగును.
  • మట్టిపెళ్లలు నలుపువాడు , గడ్డిపరకలు పీకువాడు , గోళ్లు కోరుకువాడు శీఘ్రముగా వినాశమును పొందును.
  • పొగరుబోతు వలే మట్లాడరాదు . పూలదండను బయట ధరించరాదు. గోవును ఎక్కి పోరాదు.
  • ద్వారము ద్వారా ప్రవేశించవలెను దొడ్డిదారిన ప్రవేశించరాదు. గ్రామమునకు గాని , గృహమునకు గాని ప్రహారీగోడ ఉండవలెను . రాత్రుల యందు చెట్ల మొదళ్లుకి దూరంగా ఉండవలెను .
  • ఎన్నడూ జూదము ఆడరాదు. చెప్పులు చేతపట్టుకొని నడవరాదు. మంచము మీద కూర్చొని భుజించరాదు . చేతితో ఎక్కువ ఒకేసారి పట్టుకొని కొంచంకొంచం తినరాదు. ఆసనం పైన పళ్ళెము ఉంచుకుని తినరాదు.
  • సూర్యుడస్తమించిన తరువాత నువ్వులతో చేయబడిన వస్తువుని తినరాదు. శరీరం పైన వస్త్రములు లేకుండా నిద్రించరాదు ముఖం కడుగుకొనకుండా ఎచ్చటికి వెళ్ళరాదు.
  • కాళ్లు కడుగుకొని భుజించవలెను . తడికాళ్లతో నిద్రించరాదు . తడికాళ్లతో భుజించువాని ఆయష్షు వృద్ది అగును.

Leave a Reply