ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణల కమిటీ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి, రామకృష్ణంరాజు, ఈశ్వరయ్య మూడు రోజులపాటు ఢిల్లీ పర్యటించి పాఠశాలలపై అధ్యయనం జరిపారు.
ఢిల్లీ పాఠశాలల గురించి ఆలూరు సాంబశివారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఢిల్లీ విద్యావ్యవస్థ గురించి అధ్యయనం చేయడానికి కనీసం నెలకు రెండు మూడు బృందాలైనా వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి. మా పర్యటనకు ముందు రోజే బంగ్లాదేశ్ విద్యా ప్రతినిధి బృందం ఢిల్లీ పాఠశాలలను సందర్శించింది. మా సందర్శన జరుగుతుండగానే పూణే నుంచి మరో బృందం వచ్చింది. అసలు ఏముంది ఢిల్లీ విద్యావ్యవస్థలో?
ఢిల్లీ విద్యావ్యవస్థ విజయవంతం కావడానికి మూడు కారణాలు కనిపించాయి. మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ప్రస్తుత కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యకు బడ్జెట్ లో 25% కేటాయించింది. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిబద్ధతకు ఇది నిదర్శనం. ఢిల్లీలో మొత్తం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని మున్సిపల్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇక్కడ కేవలం ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు క్రేజ్ ఉండటం విశేషం.
ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం చేసిన పని పాఠశాలలకు మంచి మౌలిక వసతులు కల్పించడం. మా పర్యటనలో మొదటి రోజు మేము చెప్పాపెట్టకుండా ఒక ఉన్నత పాఠశాలకి వెళ్ళాం. టాయిలెట్లు అత్యంత శుభ్రంగా ఉన్నాయి. ఫినాయిల్ వాసన వస్తోంది. ఒక పాఠశాల మౌలిక వసతులను జడ్జ్ చేయడానికి ఒక్క టాయిలెట్ల పరిశుభ్రతనే కొలమానంగా తీసుకోవచ్చు అని నా అభిప్రాయం. దీన్ని బట్టి మిగతా మౌలిక వసతులు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. స్కూల్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరిట ఆరు పాఠశాలలను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దింది ఢిల్లీ ప్రభుత్వం. ఇవి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాతి క్రమంలో ప్రతిభ మరియు సర్వోదయ పాఠశాలల పేరుతో అభివృద్ధి చేశారు.
అత్యంత పకడ్బందీగా, వ్యూహాత్మకంగా అభివృద్ధికి బాటలు వేశారు అనిపిస్తుంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులను, తల్లిదండ్రులనే కాక తమ పార్టీ కార్యకర్తలను సైతం ఈ సంస్కరణల్లో భాగస్వాములను చేయడం విశేషం. మా బృంద సభ్యులం మొదటి రోజు పంకజ్ పుష్కర్ అనే ఎమ్మెల్యేను కలిశాము. ఆయన ఒక గంట సేపు అనర్గళంగా విద్యావ్యవస్థ గురించి తెలిపారు. మరుసటిరోజు మరో ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లాం. ఆయన లేకపోవడం వల్ల అనుచరులతో మాట్లాడాము. మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమంటే మేం మాట్లాడిన నలుగురు వ్యక్తులకు కూడా ఢిల్లీ విద్యా సంస్కరణలు గురించి స్పష్టమైన అవగాహన ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ్యాపీనెస్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, పాఠశాల యాజమాన్య కమిటీ విధానాల గురించి వారికి తెలుసు. ఉద్యమ పార్టీలు, సంస్థలు తమ కార్యకర్తలకు భావజాలాన్ని చొప్పించినట్లు వీరందరిలో విద్యా సంస్కరణల స్ఫూర్తిని నూరిపోశారు. సంస్కరణలు అనేవి కేవలం ప్రభుత్వానికి సంబంధించిన విషయంగా మాత్రమే కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మార్చారా అనిపిస్తుంది.
ఇక చివరి అంశం తల్లిదండ్రుల కమిటీలు. మన రాష్ట్రంలో తల్లిదండ్రుల కమిటీలు కొద్దిరోజుల కిందటే ఏర్పాటయ్యాయి. మన రాష్ట్రంలో ఎక్కువ భాగం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య పరస్పర అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించాల్సి ఉంది. పేరెంట్స్ కమిటీ ద్వారా తల్లిదండ్రులు తమపై పెత్తనం చెలాయిస్తారన్న భావన ఉపాధ్యాయుల్లో ఉంది. ఉపాధ్యాయుల పనితీరు, నిధుల వినియోగం పట్ల తల్లిదండ్రుల్లో అపోహలు ఉన్నాయి. ఢిల్లీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు మధ్య ఉన్న పరస్పర సహకారం అబ్బురపరుస్తుంది. తల్లిదండ్రుల కమిటీ లేకపోతే పాఠశాల అభివృద్ధి అసాధ్యమని ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. ఢిల్లీ పాఠశాలలో నెలకు రెండు సార్లు తల్లిదండ్రుల సమావేశం జరుగుతుంది. సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశాలకు విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా హాజరవడం విశేషం.
ఉపాధ్యాయుల్లో వచ్చిన పరివర్తన మరో ముఖ్యమైన అంశం. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేయిమంది ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యాభివృద్ధికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కోరారు. అయితే ఇందుకు కేవలం 54 మంది మాత్రమే స్పందించారు. మిగతా వారు ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారని ఆరా తీశారు. ఇలాంటి సలహాలు సూచనలు ఇది వరకే చాలాసార్లు ఇచ్చామని, వ్యవస్థ మీద తమకు నమ్మకం పోయింది అన్నది వారి మనోగతం. స్పందించిన 54 మంది ప్రిన్సిపాళ్ల స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా నిర్మించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ఈ 54 మందిని శిక్షణ నిమిత్తం సింగపూర్, ఫిన్లాండ్, లండన్ వంటి ప్రాంతాలకు పంపించారు. అలాగే ఔత్సాహికులైన ఉపాధ్యాయులను కూడా శిక్షణకు పంపించారు. వీరితో ఒక రిసోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు తిరిగి మొత్తం ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇచ్చారు. ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు ఆషామాషీగా కాకుండా ఉపాధ్యాయుల నైపుణ్యాలకు పనితీరుకు పదును పెట్టేలా రూపొందించారు. టీచర్లలో నిబద్ధత పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ పాఠశాలల్లో పని చేయడం తమకు గర్వకారణంగా ఉందని వారు చెబుతున్నారు.
ఈరోజు ఢిల్లీ పాఠశాలల్లో దేశవిదేశీ బృందాలు అధ్యయనం కోసం తిరుగుతున్నాయంటే ఇందుకు కారణం ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా. అయితే దీన్ని ఆయన ఒప్పుకోలేదు. ఢిల్లీ విద్యా విజయం వెనక చాలామంది ఉన్నారని, ముఖ్యంగా ఉపాధ్యాయుల దీనికి కారణమని ఆయన వినయంగా చెప్పారు. సిసోడియా ఉపముఖ్యమంత్రి గానే కాక పలు ఇతర శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. విద్యా సంస్కరణల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి కొన్ని నిదర్శనాలు. గత నాలుగు సంవత్సరాల్లో ఆయన 800 సార్లు పాఠశాలలను సందర్శించారు, ఇందులో నాలుగు వందల సార్లు ప్రార్థన సమయానికి హాజరయ్యారు. కొన్ని వందల మంది పిల్లలు మరియు తల్లిదండ్రుల పేర్లు ఆయనకు తెలుసు. అలాగే ప్రిన్సిపాళ్లు మరియు ఉపాధ్యాయులు కూడా. వెయ్యి మంది పాఠశాలల ప్రిన్సిపాల్ లకు వాట్సాప్ ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆ వాట్సాప్ గ్రూప్ ల్లో మెరుగైన విద్య కోసం మేధోమథనం జరుగుతూనే ఉంటుంది. సిలబస్, పరీక్షలు, ప్రశ్న పత్రాలు మొదలుకొని విద్యావ్యవస్థలోని ప్రతి చిన్న విషయంపైనా ఆయనకు అద్భుతమైన పట్టు ఉంది. అభ్యసనం గురించి, విద్యార్థుల సమస్యల గురించి ఒక ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్లా అలవోకగా మాట్లాడారు. ఇది ఇంకా ప్రారంభం మాత్రమేనని చేయాల్సింది ముందు ముందు ఇంకా చాలా ఉందని సిసోడియా అన్నారు. ఆయన సింప్లిసిటీ కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. ఒక సర్వోదయ పాఠశాలలో కలిశాం. దాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఒక మంత్రి సందర్శించినందుకు ఎలాంటి హడావిడి లేదు. మంత్రితో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పాఠశాలలో ఆయన ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఎలాంటి ప్రోటోకాల్స్ లేవు.
గత సంవత్సరం ఢిల్లీ విద్యాశాఖకు మరపురానిది. ఎందుకంటే మొట్టమొదటిసారి సి బి ఎస్ సి బోర్డు ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలను అధిగమించాయి. ఉపాధ్యాయులను తల్లిదండ్రులను సమాజాన్ని ఒక తాటి పైకి తీసుకు రావడం వల్లే ఈ విజయం సాధ్యం అయ్యిందని అనుకోవచ్చు.